మీడియాపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు : చంద్రబాబు

By రాణి  Published on  24 Jan 2020 6:35 AM GMT
మీడియాపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు : చంద్రబాబు

సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మీడియాపై రాష్ర్ట ప్రభుత్వ అణచివేత చర్యలను ఆయన ఖండించారు. మీడియాపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుండటంపై ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.

8 నెలలుగా రాష్ర్టంలో నిరంకుశ పాలన సాగుతోందన్నారు.. అధికారం వచ్చిందో లేదో...ముగ్గురు మంత్రులు ఉన్నపళంగా సమావేశం పెట్టి మరీ ఎంఎస్ఓలను బెదిరించారని పేర్కొన్నారు. అలాగే రెండు ఛానళ్ల ప్రసారాలపై ఆంక్షలు విధించడమే కాకుండా..మూడు ఛానెళ్లలో అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు రాకుండా నిషేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 2430 తెచ్చి మీడియాపై ఉక్కుపాదం మోపి దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలను ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. తునిలో విలేకరిని హత్య చేశారని ఆరోపించారు. చీరాలలో కూడా ఒక విలేకరిపై హత్యాయత్నం జరిగిందన్నారు. నెల్లూరులో ఒక ఎడిటర్ పై వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారని..వైసీపీ నేతల దాడులతో..రాష్ర్టంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. వైసీపీ దుర్మార్గపు చర్యలతో ఫోర్త్ ఎస్టేట్ అయినా మీడియా మనుగడకే ముప్పు వాటిల్లితోందని, మీడియా గొంతు నులిమే ప్రభుత్వ నియంత పోకడలను టీడీపీ ఖండిస్తుందన్నారు. ఇలా మీడియాపై విరుచుకుపడిన వారంతా కాలగర్భంలో కలిసిపోయారే తప్ప...చరిత్రలో మీడియాను వ్యతిరేకించి నిలిచిన నాయకుడెవరూ లేరన్నారు.

మహిళా కానిస్టేబుల్ విషయంపై స్పందించిన చంద్రబాబు

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నపుడు భద్రత విధుల్లో భాగంగా మహిళా పోలీసులు వచ్చారు. వచ్చిన వారు మందడం పాఠశాలలోని ఒక తరగతి గదిని ఆక్రమించారు. దానిని ప్రభుత్వం కేటాయించకపోయినా విద్యార్థులను బయటికి పంపి..పోలీసులు అక్కడే ఉంటున్న విషయాన్ని తల్లిదండ్రులు మీడియా దృష్టికి తీసుకెళ్లారన్నారు. దీంతో మీడియా ప్రతినిధులు ఆ పాఠశాలకు వెళ్లి తరగతి గదులలో ఆరబెట్టి ఉన్న పోలీసుల దుస్తులను ఫోటోలు తీసి, సంబంధిత ఛానెళ్లలో ప్రసారం చేశారు. దీనిపై కూడా వైసీపీ రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. కేవలం ప్రభుత్వం కక్ష తీర్చుకునేందుకే ముగ్గురు విలేకరులపై అక్రమంగా నిర్భయ కేసులు నమోదు చేయించిందని విమర్శించారు.

Next Story