ప్రపంచ రికార్డు : పది వికెట్లు పడగొట్టిన మహిళా క్రికెటర్‌.. ఎనిమిది మంది డకౌట్‌

By Newsmeter.Network  Published on  25 Feb 2020 12:33 PM GMT
ప్రపంచ రికార్డు : పది వికెట్లు పడగొట్టిన మహిళా క్రికెటర్‌.. ఎనిమిది మంది డకౌట్‌

బీసీసీఐ నిర్వహిస్తున్న అండర్‌-19 వన్డే మహిళా క్రికెట్‌ ట్రోర్నీలో చండీగడ్‌ జట్టు కెప్టెన్‌ కశ్వి గౌతమ్‌ అద్భుతం చేసింది. పదికి పది వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది. కేఎస్‌ఆర్‌ఎం కళాశాల మైదానంలో మంగళవారం అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ముందుగా బ్యాటింగ్‌ చేసిన చండీగఢ్‌ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి186 పరుగులు చేసింది. కశ్వి గౌతమ్‌ 49, సిమ్రన్‌ జోహల్‌ 42 పరుగులతో రాణించారు.

అనంతరం 187 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన అరుణాచల్‌ప్రదేశ్ జట్టు 8.5 ఓవర్లలో 25 పరుగులకే కుప్పకూలింది. కశ్వి గౌతమ్‌ 4.5 ఓవర్లలో 12 పరుగులిచ్చి మొత్తం 10 వికెట్లు పడగొట్టింది. కశ్వి ధాటికి ఎనిమిది మంది డకౌట్‌ అయ్యారు. మేఘా శర్మ(10) ఒక్కతే రెండంకెల స్కోర్‌ అందుకుని నాటౌట్‌గా నిలిచింది. ఇందులో ఆరు ఎల్బీడబ్ల్యూలు, నాలుగు క్లీన్‌బౌల్డ్‌లు ఉన్నాయి. బౌలింగ్‌లో కశ్వి విజృంభించడంతో.. చండీగడ్‌ జట్టు 161 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే.. ఇంటర్నేషన్‌ మెన్స్‌ క్రికెట్‌లో ఇద్దరే బౌలర్లు మాత్రమే పదికి పది వికెట్లు పడగొట్టారు. వారిలో ఒకరు ఇంగ్లాండ్‌ కు చెందిన జిమ్‌లేకర్‌ కాగా.. మరొకరు టీమిండియా దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే. వీరిద్దరు కూడా సుధీర్ఘ ఫార్మాట్‌(టెస్టుల్లో)లో ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టారు.

Next Story