రేపు హైదరాబాద్‌కు కేంద్ర బృందం..ఎందుకంటే

By సుభాష్  Published on  21 Oct 2020 10:20 AM GMT
రేపు హైదరాబాద్‌కు కేంద్ర బృందం..ఎందుకంటే

హైదరాబాద్‌ వరద నష్టాన్ని అంచనా వేసేందుకు గురువారం సాయంత్రం నగరానికి కేంద్ర బృందం రానుంది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌తోపాటు ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం తీవ్రతను అంచనా వేయనున్నారు. ఈనెల 13వ తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలో వేల కోట్లల్లో నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. తక్షణ సహాయంగా రూ.1350 కోట్లను విడుదల చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం రేపు సాయంత్రం హైదరాబాద్‌కు రానుంది. ఇప్పటికే నగర ప్రజలకు తక్షణ సాయం కింద ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.550 కోట్ల సాయం ప్రకటించారు. వరద ప్రభావిత కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు.

ఇక ఢిల్లీ ప్రభుత్వం రూ.15 కోట్లు, తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్లు, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం రూ.2 కోట్లు, మైహోం సంస్థ రూ.5కోట్లు, మెగాస్టార్‌ చిరంజీవి, మహేష్‌బాబు, పవన్‌ కల్యాణ్‌ రూ. కోటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి విరాళం అందించారు. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్‌ ప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ నీట మునిగింది. ఇప్పటి వరకు దాదాపు 33 మంది వరకు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఇంకా ఎన్నో ఇళ్లు వర్షాల ధాటికి నేలమట్టమయ్యాయి. వాహనాలు సైతం వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో నగర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతల్లో భారీగా నీళ్లు చేరి ఇళ్లన్ని జలమయమయ్యాయి.

Next Story