వెనుకబడ్డ ట్రంప్.. దూసుకుపోతున్న బైడన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా.. మరికొన్ని రాష్ట్రాల్లో
By Admin2 Published on 4 Nov 2020 1:33 PM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగియగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతోంది. అయితే, పోలింగ్ ముగిసిన కొన్ని రాష్ట్రాల్లో బుధవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. తొలి ఫలితాల్లో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ స్వల్ప అధిక్యంలో దూసుకెళ్తున్నారు. ప్రాథమిక ఫలితాల్లో బైడెన్ 8 రాష్ట్రాల్లో విజయం సాధిస్తే.. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరు రాష్ట్రాల్లో విజయ కేతనం ఎగురవేశారు.
ప్రస్తుతం బైడెన్‌కు 85 ఎలక్టోరల్ ఓట్లు దక్కితే.. ట్రంప్‌కు 61 ఓట్లు పొందారు. మసాచుసెట్స్, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వర్మంట్, డేలవర్, వర్జినియా, కనెక్టికట్, రోల్ ఐలాండ్‌లో బైడెన్ విజయం సాధించారు. ఇండియానా, కెంటుకీ, ఓక్లహోమా, టేనస్సీ, వెస్ట్ వర్జీనియాల, మిస్సిసీపి, అలబామా, అర్కాన్సాస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. అలాగే టెక్సాస్, జార్జియా, ఫ్లోరిడా, న్యూ హ్యాంప్‌షైర్‌లలో బైడెన్ అధిక్యంలో ఉన్నట్లు అక్కడి స్థానిక మీడియా సమాచారం.
ఇదిలావుంటే.. ఈ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా అత్యధిక ఓటింగ్ నమోదవుతున్నది. దేశంలో మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఇందులో 270 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నవారు అధ్యక్షపదవిని సొంతం చేసుకోనున్నారు. కాలిఫోర్నియాలో అత్యధికంగా 55 ఓట్లు ఉండగా, టెక్నాస్‌లో 38, న్యూయార్క్‌లో 29, ఫ్లోరిడాలో 29, పెన్సిల్వేనియాలో 20, ఇల్లినాయిస్‌లో 20 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, 30 రాష్ట్రాల్లో 10 కంటే తక్కువ ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.