టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ ముగ్గురు..?

By Newsmeter.Network  Published on  1 March 2020 12:12 PM GMT
టీమిండియా కెప్టెన్సీ రేసులో ఆ ముగ్గురు..?

న్యూజిలాండ్ పర్యటన అనంతరం టీమిండియా స్వదేశంలో దక్షణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. మార్చి 12 నుంచి ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. 12న తొలి వన్డే ధర్మశాలలో, 15న ల‌క్నో, 18న కోల్‌క‌తాలో రెండు, మూడు వ‌న్డేలు జ‌రుగనున్నాయి. అయితే.. ఈ సిరీస్‌కు కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి విశ్రాంతి నిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతుండడంతో కోహ్లీకి ఈ సిరీస్‌కి విశాంత్రి నివ్వనున్నారు. కాగా వైస్ కెప్టెన్‌ రోహిత్ శర్మ కాలి పిక్క గాయంతో న్యూజిలాండ్‌ పర్యటన నుంచి అర్థాంతరంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు హిట్‌మ్యాన్‌ అందుబాటులో ఉండే ఛాన్స్‌లు చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ సిరీస్‌లో కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలని అనే విషయం పై సెలక్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారట. ఇలా కెప్టెన్‌, వైస్‌కెప్టెన్‌ లేకుండా ఐదేళ్ల తరువాత టీమిండియా బరిలోకి దిగనుంది.

ఇదిలా ఉంటే.. కెప్టెన్సీ రేసులో ఓ ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌, లోకేష్‌రాహుల్, శ్రేయాస్‌ అయ్యర్‌. వీరిలో అత్యంత సినీయర్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌. 2018 నిదాహ‌స్ ట్రోఫీ, ఆసియాక‌ప్‌ల్లో ధావ‌న్ వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇటీవల గాయంతో బాధపడినా.. ప్రస్తుతం పూర్తి ఫిట్‌గా ఉన్నాడని సమాచారం. గ‌తంలో ఇండియా-ఎ, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ఢిల్లీ రాష్ట్ర జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించాడు.

ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో లోకేష్‌ రాహుల్ విధ్వంసక ఫామ్‌లో ఉన్నాడు. ఏ స్థానంలో బరిలోకి దిగినా.. పరుగుల మోత మోగిస్తున్నాడు. కాగా ఇప్పటి వరకు ఈ రైట్ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌కు కెప్టెన్సీ చేసిన అనుభవం అయితే లేదు గానీ.. ఓ మ్యాచ్‌లో మాత్రం విరాట్‌కు విశాంత్రి నిచ్చిన సమయంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు.

ఇటీవల కివీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌ ఆఖరి మ్యాచ్‌లో .. విరాట్‌కు విశ్రాంతినివ్వగా.. ఆ టైంలో రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలను అద్భుతంగా నిర్వహించాడు. దీంతో అతడ్ని బావి కెప్టెన్‌గా క్రీడా పండితులు అభివర్ణించారు. అంతేకాకుండా ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్.. 13వ సీజన్‌(ఐపీఎల్ 2020)లో సారధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌. టీమిండియాను ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య నెం.4 స్థానం. ఆ స్థానంలో బరిలోకి దిగుతున్న ఈ యువ ఆటగాడు ఆ స్థానానికి తగిన న్యాయం చేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్సీ అనుభవం లేకపోయినా.. జూనియర్‌ లెవల్‌ క్రికెట్‌లో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం అతని సొంతం. ఇండియా-ఎ టీమ్‌ను అన్ని ఫార్మాట్ల‌లో సార‌థిగా న‌డిపిస్తున్నాడు. గత రెండేళ్లుగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ టీమ్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. గ‌తేడాది శ్రేయ‌స్ సారథ్యంలోనే ఆరేళ్ల త‌ర్వాత ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించింది. అలాగే ముంబైని రెండేళ్ల కింద‌ట విజ‌య్ హ‌జారే ట్రోఫీని అందించాడు.

విరాట్‌కు విశాంత్రి నిచ్చి రోహిత్ గనుక ఫిట్‌గా లేకపోతే.. ఈ ముగ్గురిలో ఒకరు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ ప్రకారం చూసుకుంటే.. ఈ ముగ్గురిలో లోకేష్‌ రాహుల్‌ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.

Next Story