హైపవర్ కమిటీ నివేదికను ఆమోదించిన కేబినెట్

By రాణి  Published on  20 Jan 2020 5:42 AM GMT
హైపవర్ కమిటీ నివేదికను ఆమోదించిన కేబినెట్

వెలగపూడిలో ఉన్న సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ర్టంలో పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లుపై చర్చించిన మంత్రి వర్గం హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో మొత్తం ఏడు అంశాలపై చర్చ జరుగగా..కేబినెట్ కొన్ని విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది.

- ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం.

- రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు 10 సంవత్సరాల 15 సంవత్సరాలకు పెంచుతున్నట్లు నిర్ణయం.

- రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ.

- రాజధాని రైతు కూలీలకు ఇచ్చే పెన్షన్ రూ.2500 నుంచి రూ.5000 కు పెంపు.

- 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం.

- సీఆర్డీఏ ఉపసంహరణ, అధికార వికేంద్రీకరణ బిల్లులకు ఆమోదం.

- అమరావతిలోనే మూడు అసెంబ్లీ సెషన్స్ జరపాలని నిర్ణయం.

- కర్నూల్ లో హై కోర్టు ఏర్పాటుకు ఆమోదం.

- విశాఖకు సచివాలయం, హెచ్ ఓడీ కార్యాలయాలు.

- పులివెందుల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి ఆమోదం.

- ఇన్ సైడర్ ట్రేడింగ్ పై లోకాయుక్త విచారణ.

కేబినెట్ సమావేశంలో కొందరు మంత్రులు మూడు అసెంబ్లీ సెషన్స్ విశాఖలోనే జరపాలని పట్టుబట్టగా..మరికొంతమంది మంత్రులు మూడు ప్రాంతాల్లోనూ అసెంబ్లీ సెషన్స్ ఉండేలా చూడాలని కోరారు. ఈ విషయంపై తర్వాత చర్చిద్దామన్న జగన్ ఆఖరిలో మూడు అసెంబ్లీ సెషన్స్ అమరావతిలోనే ఉంటాయని నిర్ణయించారు. అలాగే ఈ సమావేశంలో ఏపీ జిల్లాలను పెంచే అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇది అంత త్వరగా తేలే విషయం కాదు గనుక జిల్లాల పెంపు విషయంపై చర్చ వాయిదా పడింది. కలెక్టర్ల వ్యవస్థలో మార్పు, నాలుగు జిల్లాలను కలిపి సూపర్ కలెక్టరేట్ ఏర్పాటు అంశాలు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చాయి.

మరోవైపు ఏపీ కేబినెట్ సమావేశం మొదలవ్వక ముందు నుంచే అమరావతి పరిసర ప్రాంతాల్లో రైతన్నలు, రైతు మహిళలు, ప్రజలు చేస్తున్న నిరసనలు హోరెత్తాయి. నిరసనల సెగను ముందే ఊహించిన ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎక్కడికక్కడ కంచెలు ఏర్పాటు చేశాయి భద్రతా దళాలు. నిరసనలు, ఆందోళనలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పలువురిని పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేసింది.

Next Story