తెలియ‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చా.. బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

By Newsmeter.Network  Published on  18 Jan 2020 7:13 AM GMT
తెలియ‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చా.. బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి, ప్ర‌స్తుతం ఏపీ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్న పేరిది. కేవ‌లం వైసీపీ నేత‌గా కాకుండా, త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఎంత‌లా అంటే..? సిద్దార్థ‌రెడ్డి డ్ర‌స్సింగ్ స్టైల్ నుంచి క‌ళ్ల జోడు, షూ, మాట తీరు ఇలా ప్ర‌తీ విష‌యాన్ని యువ‌త ఫాలో అవుతున్నారంటే అతిశ‌యోక్తి కాదు. మ‌రీ ముఖ్యంగా సిద్దార్థ‌రెడ్డి ఆద‌ర్శంగా యువ‌త‌ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటేనే అర్ధం చేసుకోవ‌చ్చు. అటువంటి వ్య‌క్తి తెలియ‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చా అంటూ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్ర‌ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారాయి.

ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి త‌న పొలిటిక‌ల్ కెరీర్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చారు. నందికొట్కూరు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఐదు సంవ‌త్స‌రాల నుంచి పోరాడుతున్న క‌ష్టానికి సీఎం జ‌గ‌న్ వైసీపీ రూపంలో వేదిక ఇచ్చార‌న్నారు. ఒక‌ప్పుడు త‌న‌ను చిన్న పిల్లోడు, కిడ్, రౌడీ, గూండా, ఫ్యాక్ష‌నిస్ట్ ఇలా అనేక పేర్ల‌తో పిలిచార‌న్నారు. కానీ, నేడు యువ నాయ‌కుడు అంటూ త‌న‌ను పిలుస్తున్నార‌ని, అది సీఎం జ‌గ‌న్ కార‌ణంగా త‌న‌కు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్నట్టు సిద్దార్థ‌రెడ్డి చెప్పారు.

ప్ర‌స్తుత కాలంలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు, రౌడీయిజం, గూండాయిజం అన్న‌వి లేనేలేవ‌న్నారు. ఆర్థిక నేర‌గాళ్లు మాత్ర‌మే ఉన్నారు. బాగా డ‌బ్బులు సంపాదించాలా.. భార్యాబిడ్డ‌ల‌కు బాగా తిండి పెట్టాలా.. పెద్ద పెద్ద కార్లు కొనాలా.. బిల్డింగ్‌లు కొనాలా.. ఇలా ఆలోచించేవారే రాజ‌కీయాల్లో ఉన్నారు త‌ప్పా.., ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు చేసి జైళ్ల‌కెళ్లేందుకు ఎవ్వ‌రూ సిద్ధంగా లేర‌న్నారు. ఆ క్రమంలోనే నందికొట్కూరు ప్ర‌జ‌ల్లో ధైర్యం నింపి వైసీపీని గెలిపించుకున్నామ‌ని చెప్పారు.

తాను ఎన్న‌డూ త‌ప్ప చేయ‌లేద‌ని, ఇక‌పై చేయ‌బోన‌ని సిద్దార్థ‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఫ్యాక్ష‌న్, రౌడీ మామూళ్లు, ఆడ పిల్ల‌ల‌ను ఏడిపించ‌డం వంటివి చేయ‌లేదు క‌నుక‌నే త‌న‌కు ధైర్య‌ముంద‌ని, అందులో భాగంగానే నందికొట్కూరు ప్ర‌జ‌ల‌కు తానున్నాన్న భ‌రోసా క‌ల్పించ‌డంలో సక్సెస్ అయ్యాన‌న్నారు. నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ జెండా ఎగ‌ర‌డానికి ముఖ్య కార‌ణం యువ‌తేన‌న్నారు. ఐదు సంవ‌త్స‌రాల నుంచి నందికొట్కూరులో తిరుగుతున్నాను క‌నుక‌నే ఏ గ్రామం ఎక్క‌డుంది..? ఆ గ్రామాల్లో స‌మ‌స్య‌లేమున్నాయి..? ఆ గ్రామంలో నాయ‌కుడు ఎవ‌రు..? మ‌న వ‌ర్గం ఎవ‌రు..? అవ‌త‌లి వ‌ర్గం ఎవ‌రు..? అని తెలుసుకుని ప‌నిచేశాను క‌నుక‌నే నందికొట్కూరులో వైసీపీ విజ‌యం సాధించింద‌న్నారు.

త‌న‌కు 19 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్న‌ప్పుడే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, కానీ నేడు త‌ప్ప‌క‌.. త‌ప్పించుకోలేక రాజ‌కీయం చేస్తున్నాన‌ని బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల‌కు సేవ‌చేసే గుణం ఉన్న‌ బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వంటి నాయ‌కులు రాజ‌కీయాల్లో ఉండాల‌ని భావించి ఆయ‌న‌తోపాటు రాజకీయాల్లో తిరిగాన‌న్నారు. మ‌ధ్య‌లో కేసులు న‌మోదు కావ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌న్నారు. ఆ త‌రువాత బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఓటమిపై హేళ‌న మాట‌లు ప‌డ‌లేక, తాను బ‌తికున్నంత వ‌ర‌కు కుటుంబ ప‌రిస్థితి గొప్ప‌గా ఉండాలి.. ఆ ఖ్యాతి త‌గ్గ‌కూడ‌ద‌న్న ఒకే ఒక్క కార‌ణంతో రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చానే త‌ప్ప‌.. రాజ‌కీయాల‌పై మోజుతోనే.. ప‌ద‌వుల‌పై ఆశ‌తోనే.. డ‌బ్బుల‌పైన మోజుతోనే తాను రాజకీయాల్లోకి రాలేద‌న్నారు.

Next Story