యువతి శరీరంలో బుల్లెట్ కేసు : ఆద్యంతం అనుమానాలే..!

By రాణి  Published on  30 Dec 2019 7:05 AM GMT
యువతి శరీరంలో బుల్లెట్ కేసు : ఆద్యంతం అనుమానాలే..!

అనారోగ్యం కారణంగా చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రిలో చేరిన యువతి అస్మాబేగం శరీరంలో బుల్లెట్ ప్రత్యక్షమైంది. వైద్యులు బుల్లెట్ ను చూడగానే పోలీసులకు సమాచారం ఇవ్వగా...వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది 10 రోజుల క్రితం సంగతి. అప్పుడు తమ కుమార్తెకు బుల్లెట్ గాయమే అవ్వలేదని, ఆమె శరీరంలోకి బుల్లెట్ రావడం వైద్యుల తప్పిదమేనని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసుల విచారణకు అన్ని విధాలా సహకరిస్తామని కూడా చెప్పారు. పోలీసులు, కుటుంబ సభ్యులు మొదట యువతికి బుల్లెట్ గాయం లేదని చెప్పినప్పటికీ..ఇప్పుడు ఆమెకు గాయం ఉన్నట్లుగా తేటతెల్లమయింది. అయితో కొన్ని సందర్భాల్లో పోలీసుల విచారణ సాగుతోందా..లేక నిందితున్ని కాపాడేందుకు సాగిస్తున్నారా అన్ని అనుమానాలు కూడా తలెత్తాయి. కానీ ఇప్పటికీ కూడా యువతి శరీరంలోకి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. విచారణకు కుటుంబ సభ్యులు సహకరించడం లేదని చెప్తున్న పోలీసులు..అసలు యువతి శరీరంలోకి బుల్లెట్ ఎలా వచ్చింది. గాయం ఎలా అయింది. ఆ తుపాకి ఎవరిది. కాల్చిందెవరన్న విషయాల్లో మాత్రం దర్యాప్తు కొనసాగించలేకపోయారు. చిన్న కత్తి కనిపిస్తేనే క్షణాల్లో చర్యలు తీసుకునే పోలీసులు..యువతి శరీరానికి బుల్లెట్ గాయమై ఏళ్లు గడిచాయన్న అనుమాలున్నప్పటికీ..కాల్చిన వ్యక్తిని గుర్తించకపోవడం పై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి.

యువతి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తర్వాత నిమ్స్ వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీశారు. ఆ ఎక్స్ రే లో బుల్లెట్ ఉందని గ్రహించిన వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారా లేదా అన్నది కూడా సందేహంగానే మిగిలిపోయింది. నిజానికి రక్తపు మరకలతో ఒక వ్యక్తి ఆస్పత్రికి వస్తే చికిత్స చేయకముందే డాక్టర్లు ఆ కేసును మెడికో లీగల్ కేసుగా పేర్కొంటూ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాంటిది యువతి విషయంలో ఇంత జరిగినా వైద్యులు వివరించకపోవడం గమనార్హం. ఒకవేళ సమాచారం ఇచ్చి ఉంటే ఆ బుల్లెట్‌ ఎక్కడి నుంచి వచ్చిందనేది పోలీసులు అదేరోజు విచారణ ప్రారంభించి ఉండాలి. కానీ.. అలా జరగలేదు. ఆమెకు చికిత్స పూర్తి చేసి... డిశ్చార్జి చేసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. యువతి ఇంటికెళ్లాక విచారణ చేద్దామంటే..ఆమె ఇంకా కోలుకోక పోవడంతో వివరాలు రాబట్టలేకపోయామంటున్నారు పోలీసులు. ఒక వైపు పంజాగుట్ట పోలీసులు, మరోవైపు యువతి నివాసం ఉన్న ఫలక్ నుమా పోలీసులతో పాటు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ కూడా ఈ కేసు విచారణలో ఉన్నా..ఇంకా సరైన వివరాలు రాలేదని చెప్పడం అనుమాస్పదంగానే ఉందంటున్నారు స్థానికులు.

మొదట యువతి శరీరంలో బుల్లెట్ కేసు గురించి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు పోలీసులు. కానీ బుల్లెట్ ఎక్కడినుంచి వచ్చిందన్నదానిపై అసలు చర్చ గాని, దర్యాప్తు గాని జరగలేదనే తెలుస్తోంది. రివాల్వర్ వాడిన వ్యక్తిని గుర్తించినప్పటికీ..అతడిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నవాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే దీనిపై పోలీసులు స్పందించి అసలు విషయాన్ని వెల్లడిస్తారో లేక కేసు, దర్యాప్తు అంటూ కాలం వెళ్లదీస్తారో చూడాలి.

Next Story