ముంబై : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిలో పోలీసులు తనిఖీలు చేశారు. ముంబైలోని బాంద్రా ప్రాంతం గెలాక్సీ అపార్ట్ మెంట్ లో సల్మాన్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అయితే పోలీసులు వచ్చేటప్పటికి సల్మాన్ ఇంటిలో లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులందరినీ బయటికి పంపి విస్తృత తనిఖీలు చేశారు. ఇంతకీ తనిఖీలు ఎందుకు చేశారో తెలుసా ? ఘజియాబాద్ కు చెందిన ఓ యువకుడు హీరో ”సల్మాన్ ఖాన్ ఇంటిని పేల్చేస్తున్నా. మీకు చేతనైతే ఆపుకోండి ” అని పోలీసులకు మెయిల్ పంపాడట. దీంతో ముంబై ఏసీపీ డాక్టర్ మనోజ్ కుమార్ శర్మతో పాటు బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందం డాక్టర్ మనోజ్ కుమార్ శర్మను వెంటబెట్టుకుని సల్మాన్ ఇంటికి చేరుకున్నారు.

సల్మాన్ ఖాన్ తల్లిదండ్రులు సలీం, సల్మాఖాన్, ఆయన సోదరి అర్పితలను బయటకు పంపి మొత్తం తనిఖీ చేశారు. బాంబు లేదని నిర్థారించుకున్నాక తిరిగి వారిని లోపలికి పంపారు. తర్వాత మెయిల్ పంపించింది 16 ఏళ్ల బాలుడని, అతను ఘజియాబాద్ కు చెందినవాడని పోలీసులు గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలుడిని జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

 

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.