ఏపీలో భారీ మెజార్టీతో పాలన పగ్గాలు చేజిక్కించుకున్న వైసీపీ.. దూకుడు పెంచింది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి తనదైన శైలిలో ముందుకెళ్తున్నాడు. ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను నెరవర్చుకుంటూ మరిన్ని పథకాలను ప్రవేశపెడుతున్నారు జగన్‌. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు మారిపోతున్నట్లు తెలుస్తోంది. అందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా రెండంచెల విధానం కొనసాగిస్తోంది. తాజాగా ఈనెల 12న జగన్‌ ప్రధాని నరేంద్రమోదీతో సుమారు గంటన్నర పాటు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తర్వాత రెండోసారి కూడా ఢిల్లీ టూర్‌ వెళ్లడం.. అక్కడ అమిత్‌ షా, ఇతర మంత్రులతో భేటీ కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్‌ వారం వ్యవధిలోనే రెండు సార్లు ఢిల్లీ వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఢిల్లీలో జగన్‌ మంతనాలు ఇందు కోసమేనా..

వైఎస్‌ జగన్‌ ఢిల్లీలో మోదీ, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ కావడం వెనుక ఏదో జరుగుతుందనే టాక్‌ బలంగా వినిపిస్తోంది. జగన్‌ను బీజేపీ ఏకంగా ఎన్డీఏలోకి ఆహ్వానిస్తోందని, కేంద్ర మంత్రి వర్గంలో చేరాలని చెబుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. తాగాజా ఈ విషయంపై మంత్రి బోత్స సత్యనారాయణ ఓ క్లారిటీ కూడా ఇచ్చారు. అవసరమైతే ఎన్డీఏలో చేరేందుకు వెనుకాడమని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ సర్కార్‌ సుముఖంగా ఉంది. ఒక వేళ విజయ సాయిరెడ్డికి మంత్రి పదవి దక్కకపోతే రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డికి దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక జగన్‌పై అక్రమాస్తుల కేసు ఉండటం, రాష్ట్రానికి నిధులు అవసరం ఉండటం, కొన్ని బిల్లులు పాస్‌ కావడం, అలాగే రాజధాని సమస్యలు ఉండటంతో జగన్‌ కూడా ఎన్డీఏలో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకు వీటన్నింటిని కూడా బీజేపీ క్యాచ్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎన్డీఏలో చేరేందుకు జగన్‌ ఆసక్తి చూపుతున్నారా..?

బీజేపీ సూచన మేరకు ఏన్డీఏలో చేరే అంశంపై సీఎం జగన్‌ స్పష్టమైన ప్రకటన చేయకపోయినప్పటికీ.. ఆ కూటమిలో చేరేందుకు జగన్‌ ఆసక్తి చూపుతున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా, గతంలో కూడా ఈ అంశం జగన్‌ ముందు బీజేపీ ప్రస్తావించినప్పుడు.. జగన్‌ కొట్టిపారేశారు. అలాంటి ఆలోచన మాకు లేదన్నట్లు చెప్పుకొచ్చాడు. బీజేపీ ఎవరి మద్దతు లేకుండా ఎన్డీఏ అధికారంలో వచ్చింది కాబట్టి ఇప్పుడేమి చేయలేమని, సీట్లు తక్కువగా వచ్చి ఉంటే ఎన్డీఏకు మద్దతు నిలిచి ప్రత్యేక హోదా సాధించుకునేవారమని, కానీ అందుకు వ్యతిరేకంగా జరిగిందని గతంలో అమిత్‌షాతో జగన్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సీఎం జగన్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇచ్చేశారు. ఈ భేటీలో సుమారు గంటన్నరపాటు భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వైసీపీకి రెండు మంత్రి పదవులు..?

జగన్‌ ఢిల్లీ పర్యటన హట్‌ టాపిగ్గా మారింది. ఎన్డీఏలో చేరడం కోసమే జగన్‌ ఢిల్లీ వెళ్లారని, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాతో చర్చలు జరిపారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ అంశంపై క్లారిటీ కూడా వచ్చేసినట్లు తెలుస్తోంది. వైసీపీకి రెండు మంత్రి పదవులు కూడా దక్కే అవకాశాలున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా ఢిల్లీ నుంచి అందుతున్నసమాచారం ప్రకారం.. వైసీపీకి రెండు మంత్రి పదవులు కూడా ఫైనల్‌ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది

బీజేపీ వ్యూహమేంటీ..?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో జగన్‌ పార్టీకి రాజ్యసభ సీట్లు వస్తాయి. మోదీకి రాజ్యసభలో మద్దతు అవసరం. అలాగే ఒకసారి ఇద్దరమూ కలిసి చంద్రబాబును తొక్కేసి సెకండ్‌ ప్లేస్‌లోనైనా ఉండాలనేదే బీజేపీ వేస్తున్న ప్లాన్‌ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.

తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టి ఎదురుదెబ్బే తగిలింది. అంతకు ముందు కూడా మహారాష్ట్ర, జార్ఖండ్‌, హర్యానా రాష్ట్రాల్లో కూడా చేతు అనుభవం ఎందురైంది. బలమైన ప్రాంతీయ పార్టీలతోనే కలిసి ముందుకెళ్లాలనేది బీజేపీ వేస్తున్న ఎత్తుగడలని తెలుస్తోంది.

కాంగ్రెస్‌కు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ ప్లాన్‌

జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు బలమైన కూటమి ఏర్పడకుండా ముందుగానే బలమైన ప్రాంతీయ పార్టీలతో కలిసి నడవాలనేది కాషాయ దళం వేస్తున్న ప్లాన్‌గా తెలుస్తోంది. ఇక రాబోయే నాలుగేళ్లలో తన పాలన సాఫీగా జరగడానికి, బిల్లులు పాస్‌ కావడానికి, హస్తం పార్టీ మరింతగా ముందుకెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు ఇదే సరైన మార్గమని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తాము రెండో స్థానంలో వెళ్లగలమని నమ్మకం ఉన్న చోట అక్కడి ప్రాంతీయ పార్టీలను దృష్టిలో ఉంచుకుని  బీజేపీ వైసీపీని ఆహ్వానిస్తోన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సైతం బీజేపీతో చేతులు కలిపారు. ఈ విధంగా ఏపీలో జగన్‌కు ఉన్న సమస్యలను క్యాచ్‌ చేసుకుంటున్న బీజేపీ.. ఏన్డీఏలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తోన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.