ఏపీ రాజకీయాలను చూస్తుంటే..బీహార్ రాజకీయాలు గుర్తొస్తున్నాయన్నారు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ.
సార్వత్రిక ఎన్నికలకు ముందే..వైసీపీ ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే రాష్ర్ట ప్రజలకు స్వర్గం చూపిస్తామని చెప్పింది..కానీ ఇప్పుడు స్వర్గం మాట దేవుడెరుగు ప్రజలు బ్రతికితే చాలన్నట్లుందని కన్నా విమర్శించారు. హడావిడిగా స్థానిక సంస్థల ఎన్నికలను తెరమీదికి తీసుకొచ్చిన జగన్..ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలవకపోతే అంతు చూస్తానంటూ ఎమ్మెల్యేలు, మంత్రులను హెచ్చరించారని ఆరోపించారు.

సీఎం జగన్ తన ఫ్యాక్షనిజాన్ని విచ్చలవిడిగా ప్రదర్శిస్తున్నాడని, కనీసం ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు కూడా వేయనివ్వడం లేదని వాపోయారు. ఇన్ని అరాచకాలు చేస్తూ..ఎన్నికలు నిర్వహించడం అవసరమా అని కన్నా ప్రశ్నించారు. సొసైటీ ఎన్నికలు చేసినట్లే..ఈ ఎన్నికల్లో కూడా నామినేట్ చేసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. జగన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదన్నారు. వాలెంటీర్లతో జగన్ ప్రజలను అనేక విధాలుగా బెదిరిస్తుంటే..పోలీసులు చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో కంటే..ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మరింత దిగజారిపోయిందన్నారు.

రాష్ర్ట పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేకనే వివేక హత్యపై సిబిఐ విచారణ వేసిందన్నారు. రాష్ట్ర డీజీపీ సిగ్గు తో రాజీనామా చేయాలని, వివేక హత్య కేసు పై జగన్ రాజీనామా చేస్తాడో..డీజీపీ రాజీనామా చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. డేటా చోరీ కేసులో నానా యాగీ చేసిన వైసిపి 9 నెలల పాలనలో ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. జగన్ కు దమ్ముంటే..వారు తెచ్చిన ఆర్డినెన్స్ ను వైసీపీ కూడా పక్కాగా అమలు పరచాలని సవాల్ చేశారు. వైసిపి మద్యం , డబ్బు పంచకుండా ఎన్నికలలో గెలిస్తే జగన్ కు క్షమాపణ చెప్తానన్నారు జగన్. రాష్ర్ట పోలీసులపై జగన్ కు నమ్మకం లేకపోతే..పక్క రాష్ర్ట పోలీసులతో ఎన్నికలు జరిపించాలని కన్నా సూచించారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.