• ఇంటిపేరు అల్లూరి..సాకింది గోదారి
  • ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్ గిఫ్ట్ వచ్చేసింది..

మెగా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న భీమ్ ఫర్ రామరాజు సర్ ప్రైజ్ వీడియో విడుదలైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం శుక్రవారం ఉదయం 10 గంటలకు భీమ్ ఫర్ రామరాజు హ్యాష్ టాగ్ తో ఆర్ఆర్ఆర్ అఫీషియల్ వీడియోను విడుదల చేస్తానని చెప్పింది. కానీ కొన్ని కారణాల వల్ల అది సాయంత్రం 4 గంటలకు విడుదలైంది. వీడియో విడుదలైన కొద్దిసేపటికే నెట్టింట్లో బాగా వైరల్ అయింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ వీడియోలో రామ్ చరణ్ లుక్ ను చూపించారు.

ఎన్టీఆర్ వాయిస్ తో రామ్ చరణ్ ఇన్ట్రడక్షన్ వస్తుంది. ”ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది. కలబడితే ఏగుసుక్క ఎగబడినట్టుంటది. ఎదురుపడితే సావుకైన చెమట ధారకడతది. పానమైనా..బంధూకైన వానికి బాంఛనైతది. ఇంటిపేరు అల్లూరి..సాకింది గోదారి. నా అన్న మన్నెం దొర..అల్లూరి సీతారామరాజు.” అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు ఈ వీడియోలో హైలెట్ అయ్యాయి. చివరిలో రామ్ చరణ్ ఫేస్ కనిపించీ కనిపించనట్లుగా ఉంటుంది.

చిరంజీవి తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు వీడియో చాలా అద్భుతంగా ఉందంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఏదేమైనా దేశమంతా క్వారంటైన్ లో ఉన్న తరుణంలో ఆర్ఆర్ఆర్ ఒకదాని తర్వాత ఒకటి సర్ ప్రైజ్ లు ఇచ్చి యువతలో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఇంట్లో ఉండి బోర్ గా ఫీలవుతున్నవారికి ఆర్ఆర్ఆర్ మంచి మజానిచ్చింది. ఉగాది రోజున విడుదలైన మోషన్ పోస్టర్ 5.5 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంది. దీంతో ఆర్ఆర్ఆర్ కు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.