నృత్యకళాకారిణి లీలా శాంసన్ పై సిబిఐ కేసు

By రాణి  Published on  15 Dec 2019 8:02 AM GMT
నృత్యకళాకారిణి లీలా శాంసన్ పై సిబిఐ కేసు

ముఖ్యాంశాలు

  • కళాక్షేత్ర ఫౌండేషన్ లో ఆర్థిక అవకతవకల ఆరోపణలు
  • లీలా శాంసన్ ఆధ్వర్యంలో జనరల్ ఫైనాన్స్ రూల్స్ ఉల్లంఘన
  • రూ. 7.02 కోట్ల అవినీతికి పాల్పడినట్టుగా ఆరోపణలు
  • కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ చీఫ్ విజిలెన్స్ అధికారి ఫిర్యాదు
  • లీలాశాంసన్ తో పాటు మరో నలుగురిపై సిబిఐ కేసు

న్యూఢిల్లీ : భారతీయ నృత్యకారిణి, సంగీత నాటక అకాడమీ పూర్వ అధ్యక్షురాలు లీలా శాంసన్ మీద సిబిఐ అవినీతికి పాల్పడిన కేసును నమోదు చేసింది. చెన్నైలోని కళాక్షేత్ర ఫౌండేషన్ లో కూతాంబళం నవీనీకరణ ప్రాజెక్ట్ లో లీలా శాంసన్ రూ. 7.02 కోట్ల నిధులను స్వాహా చేసినట్టుగా వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఈ కేసు నమోదయ్యింది. శాంసన్ తోపాటుగా అప్పటి చీఫ్ అకౌంట్స్ అధికారి టి.ఎస్.మూర్తి, అకౌంట్స్ అధికారి ఎస్.రామచంద్రన్, ఇంజినీరింగ్ అధికారి వి.శ్రీనివాసన్, మెస్సర్స్ సెంటర్ ఫర్ అర్కిటెక్చరల్ రీసెర్చ్ అండ్ డిజైన్ అండ్ చెన్నై ఇంజినీర్స్ ప్రొప్రైటర్ మీదకూడా సిబిఐ కేసులు నమోదు చేసింది.

నిందితుల గృహ సముదాయాల్లో సిబిఐ ఇందుకు సంబంధించి భారీ స్థాయిలో తనిఖీలు జరిపింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఛీఫ్ విజిలెన్స్ అధికారి ఫిర్యాదు మేరకు సిబిఐ నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. జనరల్ ఫైనాన్స్ రూల్స్ ని అతిక్రమించి ప్రత్యేకంగా అభివృద్ధి పనుల కాంట్రాక్ట్ ను మెస్సర్స్ సెంటర్ ఫర్ అర్కిటెక్చరల్ రీసెర్చ్ అండ్ డిజైన్ అండ్ చెన్నై ఇంజినీర్స్ కి కట్టబెట్టారని వీరిపై అభియోగం నమోదయింది. నిందితులు తమ సాధారణ అధికారాలను స్వార్థం కోసం దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడ్డారంటూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చీఫ్ విజిలెన్స్ అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారని సిబిఐ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కళాక్షేత్ర ఫౌండేషన్ కు భారీ స్థాయిలో నష్టం వాటిల్లిందని, ఐ.పి.సి 120బి(క్రిమినల్ కాన్స్పిరసీ) రెడ్ విత్ సెక్షన్ 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్) ప్రకారం అవినీతి నిరోధక చట్టం 1998కి సంబంధించిన మరో రెండు సెక్షన్ల ప్రకారం నిందితులపై సి.బి.ఐ కేసులు నమోదు చేసింది.

  • ఆడిటోరియం నవీనీకరణ కాంట్రాక్ట్ లో లుకలుకలు

లీలా శాంసన్ మే 6, 2005 నుంచి ఏప్రియల్ 30, 2012 వరకూ కళాక్షేత్ర ఫౌండేషన్ కు డైరెక్టర్ గా పనిచేశారు. 2006లో నిర్మించిన ఆడిటోరియంను నవీనీకరించేందుకు నిర్ణయంతీసుకున్న ఆమె మిగతా నిందితులతో కలసి ఉద్దేశపూర్వకంగా అవినీతికి పాల్పడ్డారంటూ వీరిపై అభియోగం మోపబడింది. 2009లో జరిగిన 33వ గవర్నింగ్ బాడీ మీటింగ్ లో సివిల్ వర్క్స్అడ్వైజరీ కమిటీ నివేదిక ప్రకారం పి.టి.కృష్ణన్, లీలా శాంసన్, మాధవి ముద్గల్ గవర్నింగ్ బోర్డ్ సిఫార్సుల మేరకు ఆడిటోరియం నవీనీకరణకు సంబంధించిన ఎస్టిమేట్ ను తయారు చేయాలి. కానీ శాంసన్ తోపాటుగా మిగిలిన నిందితులు జనరల్ ఫైనాన్స్ రూను అతిక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరించారనీ, స్వలాభం కోసం కుట్రకు పాల్పడి ఇష్టం వచ్చిన వారికి కాంట్రాక్టును కట్టబెట్టారనీ సి.బి.ఐ ప్రాథమిక విచారణలో తేలినట్టుగా అధికారులు చెబుతున్నారు.

Next Story