ముఖ్యాంశాలు

  • దశాబ్దంన్నర కాలంగా కంటున్న కల
  • నేడు ట్రయల్ రన్
  • సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు

విజయవాడ లోని బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ పై సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి రాకపోకలు ప్రారంభమవ్వనున్నాయి. దశాబ్దంన్నర కాలంగా బెజవాడ వాసులను ఊరిస్తోన్న కల నేటికి సాకారమయింది. ఏళ్ల తరబడి చుక్కలు చూపిస్తోన్న ట్రాఫిక్ కు చెక్ పెడుతూ…ప్రస్తుతం అధికారికంగా ప్రారంభోత్సవం లేకపోయినా ట్రయల్ రన్ పేరుతో వాహనాల రాకపోకలకు పచ్చజెండా ఊపనున్నారు అధికారులు.

బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ మొదటి వరుస పనుల కాంట్రాక్ట్ ను దక్కించుకున్న దిలీప్ బిల్డ్ కాన్ సంస్థకు 2016 నవంబర్ లో ఎన్ హెచ్ అధికారులు అపాయింట్ మెంట్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో సర్వీసు రోడ్డు వెంబడి చెట్లను తొలగించాల్సి రావటం, డిజైన్‌ మార్పు వల్ల మళ్లీ అలైన్‌మెంట్‌ను నిర్దేశించాల్సి రావటం వల్ల పనుల ప్రారంభానికి 8 నెలల సమయం పట్టింది. 2017 జూలైలో ఈ సంస్థ పనులను ప్రారంభించింది. 2019 నవంబర్ లోనే ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేయాల్సి ఉండగా..ఎస్వీఎస్ జంక్షన్ వద్ద వెంట్ ఏర్పాటు చేయాలన్న వివాదంతో పనులు ఆగిపోయాయి. దీంతో ఫ్లై ఓవర్ నిర్మాణం ఆలస్యమైందని పేర్కొంది దిలీప్ బిల్డ్ కాన్ సంస్థ.

అనధికారికంగా ఫ్లై ఓవర్ ప్రారంభానికి ముందు ఎన్ హెచ్ పీడీ ఏ విద్యాసాగర్ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును మర్యాదపూర్వకంగా కలుస్తారు. అనంతరం కలెక్టర్ ఇంతియాజ్ కు ఫ్లై ఓవర్ గురించి వివరిస్తారు. సాయంత్రం 5 గంటల తర్వాత విద్యుత్ వెలుగు జిలుగుల్లో ఫ్లై ఓవర్ పై నిరవధిక ట్రయల్ రన్ ప్రారంభమవుతుంది. ఏలూరు నుంచి విజయవాడ వచ్చే వాహనాలకు మాత్రమే ఈ ఫ్లై ఓవర్ పై వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఫ్లై ఓవర్ పై వన్ సైడ్ ట్రాఫిక్ మాత్రమే నడుస్తుంది. రెండు వైపులా ట్రాఫిక్ వదిలే అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉంది. కలెక్టర్, పోలీస్ కమిషనర్ తో చర్చించాకే ఈ విషయంపై ఒక క్లారిటీ వస్తుంది.

రూ.400 కోట్ల నుంచి రూ.1000 కు పెరిగిన కోట్ల ఖర్చు

ఫ్లై ఓవర్ నిర్మించాలని ప్రతిపాదన వచ్చి అరదశాబ్దం పైగా గడిచిపోయింది. ఆ తర్వాత ప్రజల డిమాండ్ మేరకు ఈపీసీ విధానంలో అధికారులు టెండర్లు పిలవగా అంచనా వ్యయం రూ.700 కోట్లకు పెరిగింది. తర్వాత భూ సేకరణ కలిపి రూ.1000 కోట్లు దాటింది. నిజానికి ఫ్లై ఓవర్ నిర్మాణ ప్రతిపాదన వచ్చినపుడే వర్క్ మొదలై ఉంటే రూ.400 కోట్లతో నిర్మాణం పూర్తయి పోయేది. ఎన్నో అవాంతరాలు, వివాదాల దాటుకుంటూ నిర్మాణం పూర్తి చేసే సరికి దశాబ్ద కాలం గడిచిపోయింది. విజయవాడ – మచిలీపట్నం నాలుగు వరుసల రోడ్డులో బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ అంతర్భాగం. దీని విలువ రూ.80 కోట్లు. జాతీయ రహదారి 16పై 760 మీటర్లుగా నిర్మించాలని నిర్ణయించారు. దీని ఆధారంగా నిర్మల జంక్షన్‌ వరకే వంతెన నిర్మించాలనుకున్నారు. ఎంపీ కేశినేని నాని చొరవతో ఎన్‌హెచ్‌ ఉన్నతాధికారులను రప్పించి క్షేత్రస్థాయిలో చూపించి ఫ్లై ఓవర్‌ను 1,470 మీటర్లకు పొడిగించారు. ఆరు వరుసల్లో సింగిల్‌గా సెంట్రల్‌ డివైడర్‌పై నిర్మించాల్సిన ఫ్లై ఓవర్‌ను నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు వరుసలుగా నిర్మించేందుకు డిజైన్లు చేయించారు. ఐకానిక్‌గా నిర్మించేందుకు కేంద్ర సహాయాన్ని కోరారు. ఇందుకు కేంద్రం అంగీకరించకపోయినా రెండు వరుసలకు ఓకే చెప్పింది.

సర్వీస్ రోడ్డుకు నిధులివ్వని కేంద్రం

మొత్తానికి ఎలాగొలా ఫ్లై ఓవర్ నిర్మాణాన్నైతే పూర్తి చేశారు గానీ..సర్వీస్ రోడ్డు మాట మరిచిపోయారో ఏమో. ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తుందన్న ఆనందం కంటే..సర్వీస్ రోడ్డు లేదన్న ఆందోళనే ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సర్వీస్ రోడ్డుకు సంబంధించిన భూమిని సేకరించేందుకు ముప్పతిప్పలు పడ్డారు. బెంజిసర్కిల్ వద్ద భూములు సేకరించడం అంటే మాటలు కాదు. ఆ భూ యజమానులతో మాట్లాడి వారిని ఒప్పించారు అధికారులు. మొత్తం 27 మంది భూ యజమానులు తమ భూములను రోడ్డుకిచ్చేందుకు అంగీకారం తెలుపుతూ పత్రాలు ఇచ్చారు. వీరికి రూ.30 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకూ ఆ ఊసే లేదు. దీంతో సర్వీస్ విస్తరణకు బ్రేకులు పడ్డాయి. స్థలాలిచ్చిన యజమానుల భూములు అప్రోచ్ లతో దిగ్భంధమయ్యాయి. వారు భూములు అమ్మడానికి కూడా వీల్లేదు. దీంతో ఎటూ పాలుపోని పరిస్థితుల్లో బాధితులు కోర్టుకెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. ఇంకా కోర్టు నుంచి తీర్పు రావాల్సి ఉంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.