బరువు తగ్గడానికి ఉపయోగించే ఆ ట్యాబ్లెట్లు.. క్యాన్సర్ కు కారకం..!

By Newsmeter.Network  Published on  16 Feb 2020 11:41 AM GMT
బరువు తగ్గడానికి ఉపయోగించే ఆ ట్యాబ్లెట్లు.. క్యాన్సర్ కు కారకం..!

ఆ ట్యాబ్లెట్లు మింగితే బరువు తగ్గుతారు అని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి వలన బరువు తగ్గడం దేవుడెరుగు.. ఏకంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందంట..! దీంతో ఆ ట్యాబ్లెట్లను మార్కెట్ లో నుండి ఉపసంహరించుకున్నారు. జపాన్ కు చెందిన Eisai Inc కంపెనీ బెల్విక్(Belviq) మందులను మార్కెట్ నుండి స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంది. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) బెల్విక్ ట్యాబ్లెట్లు వాడడం వలన కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆరోపణలు గుప్పించడంతో Eisai Inc కంపెనీ వాటిని మార్కెట్ నుండి స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంది.

వెంటనే రోగులు బెల్విక్ మందులను వాడడం ఆపేయాలని ఎఫ్.డి.ఏ. తెలిపింది. ఇప్పటికే తెచ్చుకున్న వాటిని పారవేయాలని సూచించింది. డాక్టర్లు బెల్విక్ కు ప్రత్యామ్నాయంగా వేరే మందులను రోగులకు సూచించాలని కోరింది.

బెల్విక్ ను 2012 లో అప్రూవ్ చేశారు. అదే సమయంలో ఇంకో రెండు మూడు సంస్థలు తయారు చేసిన వెయిట్ లాస్ ట్యాబ్లెట్ల కంటే బెల్విక్ పిల్స్ బాగా పనిచేయడంతో ఇవి బాగా హిట్ అయ్యాయి. చాలా మంది బరువు తగ్గడానికి ఇవి పనిచేశాయి. వీటిని వాడడం వలన హృదయ సంబంధిత వ్యాధులు కూడా దరికి చేరలేదని తేల్చారు.

ఎఫ్.డి.ఏ. చేసిన తాజా సర్వేలో భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. వీటిని వాడిన వారిలో 7.7 శాతం మందికి కేన్సర్ సోకినట్లు తెలిపారు. బొలీవిక్ వాడిన వాళ్లలో పాంక్రియాటిక్, కొలొరెక్టల్, లంగ్ క్యాన్సర్ బారిన పడ్డట్టు తేలింది.

బొలీవిక్ వాడిన వారు భయపడాల్సిన అవసరం లేదని Eisai Inc కంపెనీ చెబుతోంది. ప్రత్యేకంగా క్యాన్సర్ కు సంబంధించిన పరీక్షలు అవసరం లేదని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ మందులను వైద్యుల పర్యవేక్షణ లేకుండా అధికంగా వాడిన వారిలోనే క్యాన్సర్ వచ్చే రిస్కు ఉందని చెబుతున్నారు. బరువు తగ్గడంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి తమ బొలీవిక్ ఉపయోగపడిందని అంటున్నారు. బొలీవిక్ కు కొనసాగింపుగా తీసుకొని వచ్చిన బొలీవిక్ ఎక్స్.ఆర్. ను కూడా మార్కెట్ నుండి ఉపసంహరించుకున్నారు.

Next Story