నవతరం నటులకు “చిరు” సలహా : క్రమశిక్షణ నేర్చుకొండి

By Newsmeter.Network  Published on  3 March 2020 11:04 AM GMT
నవతరం నటులకు “చిరు” సలహా : క్రమశిక్షణ నేర్చుకొండి

కాలం మారుతుంది. సినీ రంగంలోనూ కొత్త పోకడలు వస్తున్నాయి. కొత్త టెక్నాలజీ పనిని సులువు చేస్తున్నాయి. కానీ కొన్ని అనవసరపు అలవాట్లు కూడా సినీ రంగంలోని ప్రవేశించాయి. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఈ విషయాన్నే అందరి ముందూ ఎత్తి చూపి ఒక పెద్ద పని చేశారు. ఇటీవల ఓ పిట్టకథ సినిమా ఫంక్షన్లో ఆయన మాట్లాడుతూ... ఈ రోజుల్లో స్టార్లు ఎక్కువ సమయం వ్యానిటీ వాన్లలో గడుపుతున్నారని, దీని వల్ల సమయం వృధా అవుతోందని, నిర్మాణ వ్యయం పెరుగుతోందని అన్నారు. అసిస్టెంట్ డైరక్టర్లు ఎక్కువ సమయం హీరోలను షాట్ కి పిలవడంలోనే గడుపుతున్నారని ఆయన ఆక్షేపించారు.

తమ సమయంలో అసలు వ్యానిటీ వ్యాన్లే ఉండేవి కావని చిరు అన్నారు. నిజానికి వ్యానిటీ వాన్లు కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి, మేకప్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలని, రెస్టు తీసుకోవడానికి కాదని ఆయన అన్నారు. నటులు త్వరగా షూట్ కి హాజరైతే దర్శకుడు త్వరగా షాట్ ముగించగలడు. అప్పుడు సినిమా త్వరగా తయారవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీని వల్ల నిర్మాతలకు వృథా ఖర్చు తప్పుతుందని ఆయన అన్నారు.

నేను మొదట్నుంచీ క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ వచ్చాను. ఉదయం ఏడున్నర కి షూటింగ్ ఉంటే నాలుగు గంటలకే లేచేవాడిని, ఏడు గంటలకల్లా షూటింగ్ స్పాట్ కి మేకప్ తో సహా హాజరయ్యేవాడిని. నటులకు క్రమశిక్షణ చాలా ముఖ్యం. అందరూ క్రమశిక్షణతో పని చేసి 99 రోజుల్లో సినిమాని పూర్తి చేయాలి. తద్వారా మనం ఇతర సినీ పరిశ్రమలకు ఆదర్శంగా నిలుస్తామన్నారు చిరంజీవి. తాను, నాగార్జున కలిసి సినీ పరిశ్రమ అభివృద్ధికోసం ప్రభుత్వంతో చర్చిస్తున్నామని ఆయన అన్నారు. తన తదుపరి చిత్రం పేరు ఆచార్య అని ఆయన వెల్లడించారు. తన చిత్రాలు విమర్శలను ఎదుర్కొన్నప్పుడు మానసికంగా కుంగిపోయానని దర్శకుడు విశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నెగటివ్ ప్రచారాన్ని పట్టించుకోవద్దు, కష్టపడి పనిచేస్తే ఫలితం దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story