అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలు: మంత్రి కేటీఆర్
By సుభాష్ Published on 29 Sep 2020 9:32 AM GMTతెలంగాణలో బతుకమ్మ పండగకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండగకు ఆడపడచులకు తమతమ పుట్టిళ్లకు వెళ్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి బతుకమ్మ పండగకు ఉచితంగా చీరలను అందజేస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అక్టోబర్ 9వ తేదీ నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. బతుకమ్మ పండగ చిరు కానుకగా ప్రభుత్వం ప్రతియేడాది పేదింటి ఆడ బిడ్డలకు చీరలను పంపిణీ చేస్తుందని అన్నారు. మంగళవారం బేగంపేట హరిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల ప్రదర్శనలో మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చీరలను ఆవిష్కరించారు. కరోనా వైరస్ దృష్ట్యా చీరలను మహిళల ఇళ్ల వద్దే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. మహిళా సంఘాలు చీరలను పంపిణీ చేస్తాయని పేర్కొన్నారు. ఈ ఏడాది 287 డిజైన్లతో బంగారం, వెండి జరీ అంచులతో చీరలను తయారు చేశారు. రూ.317.81 కోట్ల వ్యయంతో కోటికిపైగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు.
నేతన్నల కష్టాలేంటో సీఎంకు బాగా తెలుసు
నేతన్నల కష్టాలేంటో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాగా తెలుసని, ఉద్యమ సమయంలోనే నేతన్నల కష్టాలను స్వయంగా చూశారని అన్నారు. ఒక్క నెలలో ఏడుగురు నేతన్నలు ఆత్మహత్య చేసుకోవడం చూసి కేసీఆర్ చలించిపోయారన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లోనే రూ.1200 కోట్ల బడ్జెట్‌ను చేనేత జౌళి శాఖకు కేటాయించారన్నారు. పవర్ లూమ్స్‌కు చేతి నిండా పని కల్పిస్తున్నారని, ప్రతి యేడాది కోటి చీరలు తయారు చేయాలని సీఎం ఆదేశించారన్నారు.
2017లో - రూ.220 కోట్లు
2018లో - రూ.280 కోట్లు
2019లో - రూ.313 కోట్లు
2020లో - రూ.317.81 కోట్లు బతుకమ్మ చీరలకు వెచ్చిస్తున్నామని చెప్పారు. వేలాది నేతన్నల కుటుంబాలకు ఉపాధి కల్పించామని గుర్తు చేశారు. ఒక్క బతుకమ్మ చీరలకే రూ.1033 కోట్లు ఖర్చు పెట్టామని, ఈ నాలుగేళ్లలోనే నాలుగు కోట్ల చీరలను పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ చీరలకు 30 లక్షల మీటర్ల గుడ్డను ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు.
ప్రభుత్వ స్కూల్ యూనిఫాం కూడా పవర్ లూమ్స్ ద్వారానే..
ప్రభుత్వ పాఠశాలలకు చెందిన యూనిఫాంలను కూడా పవర్ లూమ్స్ ద్వారానే ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. అంగన్‌వాడీలు, ఇతర ఐసీడీఎస్ సిబ్బందికి చెందిన చీరలు, కేటీఆర్ కిట్‌లో ఇచ్చే చీరలను కూడా పవర్ లూమ్స్ ద్వారానే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఇలా ఉపాధి కల్పించడం ద్వారా నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయాయని, రైతు, నేతన్న ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా అవతరించింది అని కేటీఆర్ అన్నారు. అలాగే బతుకమ్మ పండుగకే కాకుండా రంజాన్, క్రిస్మస్ పండగలకు కూడా చీరలను పంపిణీ చేస్తున్నామన్నారు.