ఈ కండక్టర్ కలెక్టర్ కాలేదు...!!!

By రాణి  Published on  1 Feb 2020 5:47 AM GMT
ఈ కండక్టర్ కలెక్టర్ కాలేదు...!!!

మనకి కథలంటే చాలా ఇష్టం. అందునా తోట రాముడు రాకుమారిని పెళ్లాడినా... పేదవాడు రాజయినా.... కండక్టర్ కలెక్టరయినా మనం మరీ ముచ్చటపడిపోతాం. ఎందుకంటే మనలో చాలా మందికి తీరని కోరికలుంటాయి. అవి తీర్చుకునేందుకు ఫాంటసీ ప్రపంచంలోకి వెళ్లిపోతాం. ఆ కథలనే పదేపదే చెప్పుకుని మురిసిపోతాం. ఇదిగో సరిగ్గా అలాంటి కథే కండక్టర్ మధుది. ఆయన స్పెషాలిటీ ఏమిటంటే ఆయన తనను తాను మాత్రమే మోసం చేసుకోలేదు. మనందరినీ కూడా మోసం చేసేశాడు.

ఇంతకీ కథేంటంటే మధు అనే పేరున్న మనోడు బెంగుళూరు సిటీ బస్సులో కండక్టర్. ఆయన హఠాత్తుగా అందరికీ తాను సివిల్స్ లో సెలెక్ట్ అయ్యాడని ప్రకటించేశాడు. ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాయి. ఫైనల్స్ క్లియర్ అయ్యాయి. ఇక మిగిలింది ఇంటర్ వ్యూయే అని అందరికీ చెప్పేశాడు. ఇంకేముంది? పత్రికలు ఆయన ఇంటికి క్యూ కట్టాయి. బస్సులో టికెట్లు ఇస్తుంటే ఫోటోలు తీశాయి. “ఈ కండక్టర్ కలెక్టర్ కానున్నాడు” అని వార్తలు వ్రాసేశాయి. ఇక ఆయన విజయ గాథలను వివరించి మరీ మురిసిపోయాయి. “ఏడు గంటలు డ్యూటీ చేసి, ఇంటికెళ్లి రోజూ అయిదు గంటలు చదువుకునేవాడు. పుస్తకాలు చదివితే సమయం పడుతుందని యూట్యూబ్ విడియోలు చూసి నేర్చుకున్నాడు. డిప్లమో మాత్రమే చదివిన మనవాడు డిస్టెన్స్ మోడ్ లో డిగ్రీ చేసి మరీ సివిల్స్ కి అర్హత సంపాదించుకున్నాడట” వంటి విశ్వాస విజయ గాధలను ప్రకటించేశాయి.

సోషల్ మీడియా ఇక ఆయన్ను భుజానికి... కాదు కాదు... తలమీదకెత్తుకుంది. ఆయన ఫీలింగ్స్, ఆయన కామెంట్స్, ఆయన వర్కింగ్స్... ఆయన స్పీకింగ్స్ అన్నీ వైరల్ ఫీవర్ వచ్చినట్టుగా వ్యాపించాయి. మధు కూడా అడిగిన పేపర్లు, ఛానెళ్లకు ఇంటర్ వ్యూలు ఇచ్చేశారు. ఇంతలో ముంబాయి మిర్రర్ పత్రికలో ఒక జర్నలిస్టుకు ఎందుకో సందేహం వచ్చింది. ఆయన ఇంటర్ వ్యూకి సెలక్ట్ అయిన వారి జాబితాను చూశాడు. అక్కడ మధు పేరు లేదు. మధుకుమారి అనే ఒక అమ్మాయి పేరు మాత్రం ఉంది. దాంతో ఆ పత్రిక, దాని అనుబంధ పత్రికలు ఈ వార్తను తమ సోషల్ మీడియా ఎడిషన్ల నుంచి తొలగించేశాయి. ఇప్పుడు బస్సుల యాజమాన్యం కూడా మధు వ్యవహార శైలిపై పెదవి విరిచి, విచారణ మొదలుపెట్టింది. మన మధుకి సన్మానాల పర్వం ఆగిపోయి, తిట్ల పర్వం మొదలైంది. కలెక్టర్ సంగతి అటుంచండి, ఇప్పుడు మనోడు కండక్టర్ గా కూడా మిగులుతాడా అన్నదే అసలు ప్రశ్న!!

Next Story