బ్యాంకాక్ కు వెళ్లి రావాలనుకుంటున్నారా.. చాలా తక్కువే..!

By రాణి  Published on  19 Feb 2020 12:26 PM GMT
బ్యాంకాక్ కు వెళ్లి రావాలనుకుంటున్నారా.. చాలా తక్కువే..!

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భారతీయులు ఎక్కువగా థాయ్ లాండ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకు వెళుతూ ఉంటారు. అక్కడ టూరిస్ట్ వీసా దక్కడం కూడా చాలా ఈజీనే..! కానీ ఈ ఏడాది కోవిడ్-19 వైరస్ విపరీతంగా ప్రబలడంతో ఈశాన్య ఆసియా దేశాలకు టూర్ వెళ్లాలంటేనే మనోళ్లు జంకుతూ ఉన్నారు. దీంతో సింగపూర్, కౌలాలంపూర్ లాంటి దేశాలకు వెళ్లే వారే కరువవ్వడంతో ఫ్లైట్ ఛార్జీలు భారీగా తగ్గాయి. రాబోయే రోజుల్లో కేవలం 13000 రూపాయలతో బ్యాంకాక్ నుండి భారత్ కు వచ్చేయొచ్చట. సాధారణంగా ఈ ధరలు కొన్ని నెలల ముందు బుక్ చేసుకుంటేనే లభిస్తాయి.. కానీ కేవలం వారాల వ్యవధిలో ఇంత తక్కువ ధరకు లభించడం చాలా అరుదు అని అంటున్నారు. ముంబై నుండి బ్యాంకాక్ కు వెళ్లాలనుకుంటే ఈ వారాంతంలో 12300రూపాయలకే వెళ్లొచ్చట.. అలాగే ఢిల్లీ నుండి బ్యాంకాక్ కు 13400 రూపాయలు. ఢిల్లీ నుండి బగ్డోరా కు 11000 రూపాయలకే వెళ్లొచ్చు. ఆయా దేశాలకు వెళ్లే ప్రయాణీకుల సంఖ్య బాగా తగ్గడంతో విమాన ఛార్జీలు భారీగా దిగి వచ్చాయి. సింగపూర్ ఎయిర్ లైన్స్ ఇప్పటికే భారత్ కు వచ్చే విమానాల సంఖ్యను బాగా తగ్గించింది. ముంబై, కొచ్చి ఎయిర్ పోర్టులకు కూడా సింగపూర్ ఎయిర్ లైన్స్ తమ సర్వీసులను తగ్గించేసింది.

మార్చి-ఏప్రిల్ నెలల్లో ఆయా దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది.. కానీ ఇటీవల చోటుచేసుకుంటున్న ఘటనల దృష్ట్యా, వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని బుకింగ్స్ ను భారీగా తగ్గించేశారు. హాలిడేస్ లో అక్కడికి వెళ్ళాలి అనుకునే వారు కూడా వేరే ప్రాంతాలకు తమ టూర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 55 శాతం వరకూ బుకింగ్స్ తగ్గాయి. విమాన చార్జీలు తగ్గించినా కూడా ఆగ్నేయ ఆసియా దేశాలకు టూర్ వెళ్లాలంటే జంకుతున్నారు. చాలా మంది సెంట్రల్ యూరప్ కు టూర్ వెళ్ళడానికి ప్లాన్లు చేస్తున్నారు. వేసవి కాలంలో క్రూయిజ్ షిప్ లలో గడపాలని అనుకునే వాళ్ళు కూడా బాగా తగ్గినట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది 50000 మంది భారతీయులు క్రూయిజ్ షిప్ లలో గడుపుతూ ఉంటారని.. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా తారుమారైంది. డిమాండ్ భారీగా తగ్గడంతో క్రూయిజ్ కంపెనీలు కూడా సింగపూర్ నుండి తమ షిప్ లను వెనక్కు తెప్పిస్తున్నాయి.

Next Story