నిర్భయ, దిశ లాంటి చట్టాలెన్ని వచ్చినా.. మహిళల పట్ల అకృత్యాలు, వేధింపులు ఆగడం లేదు. ప్రజా రవాణా వ్యవస్థలో పనిచేస్తూ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడో కండక్టర్. తన చేతులతో ఆమె చేతులను నలిపేస్తూ.. తాక రాని చోట తాకడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

ఓ యువతి బెంగళూరు నుంచి హసన్‌ వెళ్లేందుకు కేఎస్‌ఆర్టీసీ బస్సు ఎక్కింది. టిక్కెట్‌ తీసుకున్న అనంతరం తన సీటులో కూర్చొంది. తరువాత కొద్దిసేపటి కండక్టర్‌ వచ్చి తన ప్రక్కన కూర్చున్నాడు. తరువాత అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కొద్దిసేపు ఈ వికృతచేష్టలను భరించిన ఆ యువతి.. ఆ కండక్టర్ చేష్టలను వీడియో తీసింది. తరువాత అతనిని చెప్పుతో కొట్టి మార్గమధ్యలోనే బేలూరు వద్ద బస్సు దిగిపోయింది. తరువాతి రోజు తన తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి బెంగళూరు వెళ్లి తనను వేధించిన కండక్టర్‌ను చితకబాది.. పోలీసులకు అప్పగించింది.

‘శనివారం ఉదయం బెంగళూరు యశ్వంతపురలో గోవర్ధన థియేటర్ సమీపంలో ఉదయం 8.45 గంటలకు బస్సు ఎక్కాను. రూ.194 పెట్టి టికెట్ కొనుగోలు చేశాను. బస్సు సోలూరు దగ్గరకు వెళ్లగానే కండక్టర్ నా దగ్గరకొచ్చి పక్క సీట్లో కూర్చున్నాడు. తర్వాత నన్ను అనుచితంగా తాకడం మొదలుపెట్టాడు. అరిస్తే నీ పరువే పోతుందని హెచ్చరించాడు. దీంతో అతడు చేస్తున్న పనిని ఫోన్లో రికార్డ్ చేశాను. నేను వీడియో తీస్తున్న విషయం గమనించిన అతడు.. నా ఫోన్ లాక్కొని, నంబర్ తీసుకున్నాడు. తనతో టచ్‌లో ఉండమని చెప్పాడు. బేలూరు క్రాస్ వద్దకు రాగానే నేను సీట్లో నుంచి పైకి లేచి అతడి చెంప చెల్లుమనిపించా. అనంతరం మరో బస్సులో హసన్ వెళ్లిపోయాను’’ అని 21 ఏళ్ల బాధితురాలు తెలిపింది.

వేరే బస్సు ఎక్కిన అనంతరం వీడియోను అమ్మానాన్నకు, స్నేహితులకు పంపించిందని, ఆదివారం బెంగుళూరు వచ్చిన యువతి.. యశ్వంపుర దగ్గర కండక్టర్‌ను పట్టుకొని చితకబాది తమకు అప్పగించారని పోలీసులు తెలిపారు. అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఇసుబు అలీ తల్లురా(40)గా గుర్తించారు. ఘటన వెలుగు చూడడంతో ఆర్టీసీ అధికారులు అతడ్ని సస్పెండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.