మీ అందరి ప్రార్థనలు ఫలించాయి: ఎస్పీ చరణ్‌

By సుభాష్  Published on  15 Sep 2020 7:23 AM GMT
మీ అందరి ప్రార్థనలు ఫలించాయి: ఎస్పీ చరణ్‌

ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం వేగంగా మెరుగు పడుతోంది. నాన్న ఎంతో హుషారుగా వ్యవహరిస్తున్నారని బాలు కుమారుడు ఎస్పీ చరణ్‌ అన్నారు. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆయన సోమవారం సాయంత్రం వీడియోను విడుదల చేశారు. ఈనెల 10న నేను మీడియాతో మాట్లాడాను.. ఈ నాలుగు రోజుల్లో నాన్న ఆరోగ్యంలో ఎంతో మార్పు వచ్చింది. ఫిజియోథెరపీ కొనసాగుతోంది. వైద్యులు కూర్చోబెట్టగా దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు వారిలో మాట్లాడుతున్నారు. ఊపిరితిత్తుల సమస్య ఎంతో మెరుగుపడింది. నాన్న ఆరోగ్యంలో మరింత పురోగతి కనిపిస్తోంది. మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను.. అని ఎస్పీ చరణ్‌ పేర్కొన్నారు.

కాగా, బాలసుబ్రహ్మణ్యంకు ఆగస్టు 5న కరోనా పాజిటివ్‌ రావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత ఎక్మో సాయం అందిస్తూ చికిత్స కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా స్పృహలోనే ఉన్నారని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అయితే కరోనా వచ్చిన తర్వాత ఇటీవల మళ్లీ కోవిడ్‌ పరీక్షలు చేయగా, నెగిటివ్‌ వచ్చింది. ఇన్ని రోజులు బాలు అనారోగ్యం కారణంగా బాగా నిరసించి పోయారని, అందుకే ఇంకా చికిత్స కొనసాగుతుందని వైద్యులు వివరించారు.

Next Story