రాశి ఫలాలు డిసెంబర్ 15 నుంచి 21 వరకు

By Newsmeter.Network  Published on  15 Dec 2019 6:59 AM GMT
రాశి ఫలాలు డిసెంబర్ 15 నుంచి 21 వరకు

మేష రాశి:

ఈ రాశివారికి లగ్నాధిపతి కుజుడు సప్తమ వీక్షణం చేత శారీరిక స్థితిగతులను వృద్ధి చేస్తాడు. అష్టమ రవి బుధులు చిత్తచాంచల్యాన్ని దేహ తాపాన్ని కలిగిస్తారు. భాగ్యం లోనున్న గురు శని కేతులు స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కేతువు వల్ల దైవ భక్తి పెరుగుతుంది. తృతీయ మందున్న రాహువు సోదరులతో విరోధాన్ని సూచిస్తుంది. వీరికి ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ కొద్దిపాటి లాభము పురోగతి కనిపిస్తుంది. మీకుటుంబంలో చిన్నపిల్లలైతే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పదిహేను సంవత్సరాలు దాటిని పిల్లలైతే ఆందోళనకు గురి కాకుండా మీ భరోసా వారు కోరుకుంటారు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి పొరపొచ్చాలు వచ్చినా పురుషులే సర్దుకుపోవడం మంచిది.భార్య తరపు వారి వల్ల కొద్దిపాటి లాభదాయక సూచనలు ఉన్నాయి. ఈ రాశి క్రూర రాశి క్షత్రియ రాశి అవడం మూలాన కుజ దృష్టి వలన ఆవేశం ఎక్కువగా ఉంటుంది. అశ్విని వారికి ఈ వారం నైధన తారతో ప్రారంభం కాబట్టి ప్రతికూలతలు ఎక్కువ. భరణి వారికి సాధన తార కావున శుభ ఫలితాలు పొందగలరు. కృత్తికా ఒకటో పాదం వారికి శుభాశుభ మిశ్రమం.

పరిహారం : పదిహేనవ తేదీ పుష్యార్క యోగం కాబట్టి సూర్యనమస్కారాలు చేయండి. ప్రశాంతత కోసం ప్రాణాయామం యోగ సాధన చేయండి.

వృషభ రాశి :

ఈ రాశివారికి రాశ్యాధిపతి శుక్రుడు భాగ్యంలో వుండడంవల్ల ప్రయత్న లోపమే తప్ప మీ అభివృద్ధికి ఆటంకం లేదు. మందబుద్ధి గురువు నందు దైవము నందు వ్యగ్రత కలిగి ఉంటారు. ఈక్షేత్రం పైన రవి దృష్టి బాగోలేదు కావున వాహనాలు నడిపేటప్పుడు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించండి. ధనరాహువు మీకు మేలు చేస్తాడు కానీ నేత్ర సంబంధము ఉదర సంబంధ రోగాలు సూచన ప్రాయంగా ఉన్నాయి . భాగ్య శుక్రుని పంచమ దృష్టి ఆకస్మిక ధనలాభం కోర్టు వ్యవహార లాభం సూచిస్తున్నాయి. తాత్కాలిక మిత్రులైన బుధ, చంద్ర, రవి, కుజ ,గురు, శనులు మీకు మంచి వాక్ స్వాతంత్య్రాన్ని కార్యదక్షతని చేకూరుస్తున్నారు. గురు మౌఢ్యం మీకు మందత్వాన్నిస్తూ జ్ఞాపక శక్తిని తగ్గించవచ్చు. ఆలోచించి చేస్తే ఏ పనైనా మీకు సాధ్యం కాకపోదు. కృత్తికా మూడునాలుగు పాదాల వారికి ప్రత్యక్తారగాన శుభాశుభ మిశ్రమం. రోహిణి వారికి క్షేమ తారగావున తొంభై శాతం శుభఫలితాలు లభిస్తాయి. మృగశిర ఒకటి రెండు పాదాలు వారికి విపత్తార గావున ఆలోచించి గురువుల యొక్క సూచనలతో ముందుకు సాగండి.

పరిహారం : శుక్రవారం మంగళవారాల్లో ఖడ్గమాలా పారాయణం చేయండి. శనివారం నాడు శనికి తైలాభిషేకం లేదా చిమ్మిలి ఆవుకు తినిపించండి సత్ఫలితాలు వస్తాయి.

మిధున రాశి :

ఈ రాశివారికి ఉచ్చరాహువు శారీరక దారుఢ్యాన్నిస్తాడు. దూర ప్రదేశానికి వెళతారు. మీరు అనుకున్న భావాలు గల గురువులను దర్శిస్తారు. బుధుడు ఆరవ ఇంటి నుండి సమత్వాన్ని ఇచ్చి రక్షిస్తాడు. గురుకృప బావుంటుంది. అనుకున్న వన్నీ జరుగవు కానీ జరిపే వ్యక్తులను గానీ ఆలోచన గానీ పొందగలరు. మీ వేగానికి కళ్లెం పడినట్లే భావించవచ్చు. కొన్ని వ్యతిరేక ఫలితాలు శత్రుబాధలు చవిచూస్తారు. వారం మధ్యలో కొంత ప్రశాంతతను పొందుతారు. ఈ రాశిపై సములైన గురుశనుల దృష్టి మీ కష్టాలను తొలగిపోవడానికి దోహదపడతాయి. శత్రువులు పరాజయం పొందుతారు. మిత్రులు అధి మిత్రులై మీకు తోడ్పడగలరు. కానీ వ్యయం మాత్రం తప్పదు. స్థిర చర ఆస్తుల కోసం వాగ్వాదాలు ఉంటాయి. మాట కటుత్వం తగ్గించండి. ఏపనినైనా పథకం ప్రకారం చేస్తే విజయం పొందగలరు. మృగశిర మూడు నాలుగు పాదాల వారికి విపత్తార కాబట్టి ఏ పనికైనా ఒకటి రెండుసార్లు ఆలోచించి పనిలో దిగడం మంచిది. ఆరుద్ర వారికి ఆర్థిక లాభం ఉంది. శుభ వార్తలు వింటారు. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి శుభాశుభ మిశ్రమం.

పరిహారం : నానబెట్టిన పెసలు బెల్లం కలిపి బుధవారం నాడు ఆవుకు తినిపించండి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి.

కర్కాటక రాశి :

ఈ రాశివారికి శుభాశుభ మిశ్రమం. అనుకున్నదొకటి అవుతున్నదొకటిగా జరుగుతుంది. సములైన కుజ శనులు సహకరించాలను కున్నా వీలుపడదు. తాత్కాలిక మిత్రుల బలం కూడా లేదు. మీ ఆలోచనలకు ఆచరణలకు విఘాతం కలుగనున్నది. ఎటూ తేల్చుకోలేని స్థితి. సముడైన శుక్రుడు కూడా తాత్కాలిక శత్రువే అయ్యాడు. మీ ఆశలు ఆశయాలు వెనుదిరిగినట్లు చేస్తాయి. మనోధైర్యం తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం చాలదు. గ్రహాల ప్రతికూలత ఈ వారంలో ఎక్కువగా ఉన్నది. మాట కటుత్వం వస్తుంది. దీని ద్వారా అనుకున్న సహకారం లభించడం కష్టం. ఆచితూచి మాట్లాడటం అవతలి వారి అభిప్రాయానికి విలువనివ్వడం వల్ల సమస్యల తీవ్రత తగ్గుతుంది. వాదోపవాదాలతో ప్రయోజనం లేదు. ఋణబాధ పెరుగుతుంది. మీ బాకీలు వసూలు కాకపోవచ్చు. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. దాన్ని గూర్చి ఎక్కువగా ఆలోచించకండి. వారాంతంలో మేలు ఏమైనా పొందగల రేమో చూడాల్సి ఉంటుంది. పునర్వసు నాలుగవ పాదం వారికి శుభాశుభ మిశ్రమం. పుష్యమి వారికి అనుజన్మ తార శుభాశుభ మిశ్రమం. ఆశ్రేష వారికి మిత్ర తార గనుక శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : దధి శంఖ తుషారాభం అనే శ్లోకాన్ని రోజూ చదవండి. లలితా సహస్రనామ పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

సింహ రాశి :

ఈ రాశివారికి శుభ ఫలితాల పరంపర కొనసాగుతోంది. ఐదవ ఇంట్లో నున్న గురు శని కేతువులు ఆరో ఇంటనున్న శుక్రుడు శత్రువులు గాన కుటుంబపరంగా వ్యతిరేకత పెరుగుతుంది. శత్రువులు కూడా పెరగనున్నారు. ఉద్యోగంలో గాని వ్యాపారంలో గానీ ఉన్నతి మీ శక్తి సామర్థ్యాలకు పరీక్షలుగా మారతాయి. వాక్ స్థానాధిపతి బుధుడు బాగున్నాడు గాన వాక్చాతుర్యంతో పనులు సక్రమంగా పూర్తి అవుతాయి . కానీ ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒక సమస్య వెన్నంటి బాధిస్తుంది. అనారోగ్యం కూడా ఉంది. ఇతరుల వాహనాలపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా వుండండి. పాతగొడవలు తిరుగతోడుతాయి. ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి. వెన్నుపోటు పొడిచే శత్రువర్గం మీ ద్వారా పనిచేయించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. ధనార్జన బాగుండవచ్చు కానీ మిమ్మల్ని కనిపెట్టే కళ్లు చాలా ఉంటాయి. అధికారంలో ఉన్నా రాజకీయంలో ఉన్నా ముందు చూపుతో వెళ్లండి. మిమ్మల్ని మీ సామర్థ్యాన్ని నమ్ముకోండి కొంతవరకు సుఖపడతారు. మఖవారికి నైధన తారగాన నిందారోపణ తప్పదు. పుబ్బ వారికి కార్య సాధన సాఫల్యత ఉంది. ఉత్తర ఒకటో పాదం వారికి ప్రత్యక్ తార గాన మంచి ఫలితాలు తక్కువ.

పరిహారం : సూర్య నమస్కారాలు చేయండి. పదిహేడో తేదీన శ్రీ మహావిష్ణువును లేదా రాముని దర్శించండి. "శ్రీరామ రామ రామేతి" అనే శ్లోకాన్ని పఠించండి మంచి జరుగుతుంది

కన్యా రాశి :

ఈ రాశివారికి మంచి రోజులు వస్తున్నాయి అర్ధాష్టమ శని దోషం ఉంది. కొన్ని పనులు కుంటుపడతాయి కానీ మంచే జరుగుతుంది. రెండు మూడు నాలుగ స్థానాల్లో ఉన్న రవి బుధ గురు శని కేతువులు మంచి ఆలోచనను కలిగిస్తారు. ఏదైనా మేలు చేసే అవకాశాలను కల్పిస్తారు. ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఎదుగుదల కనిపిస్తుంది. సప్తమాధిపతి గురుడు చతుర్థంలో మిత్రుడు కాబట్టి మంచి సూచనలతో మంచి పనులు చేయిస్తాడు. బంధు దర్శనం దూర ప్రయాణం లేదా తీర్థయాత్రలు చేస్తారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. మీ పిల్లల ద్వారా మంచి పేరును పొందుతారు. అధిమిత్రుడైన శని మీకు లాభించ నున్నాడు. వాయిదా పడిన చాలా పనులకు పరిష్కారం కనిపిస్తుంది. లేదా ఒక కొలిక్కి వచ్చే మార్గం దొరుకుతుంది. మంచిగా ఆలోచిస్తేమంచి ఫలితాలు మీకు రానున్నాయి. మాతాపితరుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి కార్యం జయం అవుతుంది .

ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నతిని చూడ గలరు. పదిమందికి మీరు సహాయం చేసే స్థితి వస్తుంది. వాక్ స్థానాధిపతి శుక్రుడు ఐదవ ఇంట్లో ఉన్నందువల్ల మాట పొరపడి శత్రుత్వాన్ని తెచ్చుకుంటారు. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి ప్రత్యక్తార గాన మంచి ఫలితాలు తక్కువగా ఉన్నాయి. హస్తవారికి క్షేమ తార కాబట్టి అన్నీ మంచే జరుగుతాయి . చిత్త ఒకటి రెండు పాదాల వారికి విపత్తార గావున ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి.

పరిహారం : విష్ణు సహస్రనామ పారాయణ మీకు మంచిని ఇస్తుంది. గోవు దర్శనం లేదా గోమూత్ర సేవనం చాలా మంచిది .

తులారాశి:

ఈ రాశి వారికి లగ్నంలో కుజుడు కొంత ఇబ్బంది కలిగిస్తాడు. వివాహ విషయంలోనూ, ఉద్యోగ విషయంలో ఆలస్యం జరుగుతుంది. ద్వితీయ మందున్న రవి తాత్కాలిక మిత్రుడు అయినప్పటికీ, ధన దుర్వినియోగానికి కారకుడవుతాడు. భాగ్య రాహువు స్థిర చరాస్తులను సంరక్షిస్తాడు. సోదరులతో ఉన్న వివాదాలు సద్దుమణుగుతాయి. గృహ సంబంధమైన చిక్కులు విడివడతాయి. దాంపత్య సౌఖ్యం కుటుంబసౌఖ్యం తక్కువ. క్షణంలోనే మంచిగా ఆలోచించి మరుక్షణంలోనే తప్పుడు ఆలోచనలు నిర్ణయాలు జరిగి తమ పనులను తామే వాయిదా వేసుకుంటారు. రవి బుధులు మేలు చేయడానికి సిద్ధపడినా బంధువులు మిత్రుల మధ్య సఖ్యత లోపం మిమ్మల్ని కించపరుస్తుంది. ధనానికి లోటు ఉండదు.శత్రు బాధ రోగ బాధ ఉన్నా గురుని ప్రభావం తో చక్కపడతాయి. శుక్రుడు అష్టమ స్థానాధిపతి అయిన నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు, ఉద్యోగం ప్రయత్నాలు కొనసాగుతాయి.కానీ అవి అనుకున్న స్థాయిలో ఉండవు. వృత్తి వ్యాపార అధిపతి అయిన చంద్రుడు స్వక్షేత్రం సంచారం వల్ల నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిత్త వారికి విపత్తార కావున ఫలితాలు తక్కువ. స్వాతి వారికి ఆర్థిక లాభం. విశాఖ మూడు పాదాల వారికి జన్మతార కావున శారీరిక శ్రమ.

పరిహారం: శివునికి అభిషేకం చేయండి.శుక్రవారంనాడు దేవీ స్తోత్రాలు చదవండి. వీలైతే రుద్ర పారాయణ శ్రీ సూక్త పారాయణ మంచి ఫలితాలు ఇస్తాయి.

వృశ్చిక రాశి:

ఈ రాశివారికి లగ్నంలో రవి కుడికన్ను, పార్శ్వ పోటు, నడుంనొప్పి కలిగిస్తాడు. రాజ్యాధిపతి కుజుడు 12వ ఇంట్లో ఉన్నా అధి మిత్రుడు అయ్యాడు కాబట్టి మంచి చేస్తాడు. కానీ శరీర తాపం, మనోవేదన, సమస్యలతో సతమతం తప్పదు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్న మిత్రగ్రహాలు ధైర్యంతో ముందుకు నడిపిస్తాయి. ద్వితీయ శని ప్రభావంతో అనవసర వ్యయం, అధిక వ్యయం కానున్నాయి. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సాహసం ధైర్యం పెరిగి ఆదాయం పెరుగుతుంది. దైవ భక్తితో వ్యవహరించి పనులు సానుకూల పరుచుకుంటారు. కళత్ర సౌఖ్యం తక్కువ. దూరప్రయాణం, బంధు దర్శనం చేసే అవకాశాలున్నాయి. ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. స్వక్షేత్రవర్తి అయిన గురునితో కలసి ఉండటం వల్ల ఆవేశం తగ్గి ఆలోచన పెరుగుతుంది. విశాఖ వారికి జన్మతార కావున శారీరక శ్రమ. అనూరాధ వారికి శుభాశుభ మిశ్రమం. జ్యేష్ఠ వారికి అనుకూలత ఎక్కువ.

పరిహారం:శని స్తోత్రం, శివ స్తోత్రం, యోగసాధనలు శారీరక మానసిక బాధలను తగ్గిస్తాయి.

ధను రాశి:

ఈ రాశివారికి జన్మశని ఉన్నా గురు సంచారం వల్ల తీవ్రత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం మందులు వాడకం తప్పదు. శిరోవేదన, తండ్రి అనారోగ్యము వీరిని బాగా కృంగదీస్తాయి. ధన స్థానాధిపతి అనవసర వ్యయాన్ని కలిగిస్తాడు. పిల్లలు విదేశీ చదువులు లేదా ఉన్నత చదువులు సాధిస్తారు. అనవసర పరిచయాలు పెరిగి కొన్ని ఇబ్బందులకు గురవుతారు. శతృవులైన బుధ శుక్రులు 12,8 ఇళ్లలో ఉన్నా ఈ వారం వీరు మిత్రులై రాశ్యాధి పతి ధర్మానికి సహకరిస్తారు. గురుడు బ్రాహ్మణుడైన కారణంగా ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. మాట పట్టింపులకు పోతారు.. తద్వారాతన మంచి స్థానాన్ని కోల్పోతారు. అహంకారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టనుంది. వివాహ ఆటంకాలు ఏర్పడతాయి. వృత్తిలో చిన్న చిన్న సమస్యలకే భయపడతారు.ఈ వారంలో కొత్త ఉద్యోగాలకు అవకాశమే లేదు.ఉన్నంతలో సర్దుకుపోవడం అవసరం. మూల వారికి అశుభ ఫలితాలు ఎక్కువ. పూర్వాషాఢ వారికి మిత్రతార కావున 75% మంచి ఫలితాలున్నాయి. ఉత్తరాషాడ వారికి శుభాశుభ మిశ్రమం.

పరిహారం:గురు స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం లేదా శిరిడీ సాయి చరిత్ర పారాయణ మంచిది.

మకర రాశి:

ఈ రాశి వారికి వ్యతిరేక ఫలితాలు వర్తిస్తున్నాయి. ఒకపక్క ఏలినాటి శని, మరోవైపు గురుగ్రహ అనుకూలత లేమి కలిసి ఇబ్బందికి కారణాలు అవుతాయి. అనవసర వ్యయం, ధన హాని, మానహాని ప్రాణహాని అన్ని మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనుకున్నవి ఏమి జరగకపోవచ్చు. బంధువర్గంతో విరోధం, మిత్రులతో విరోధం. మౌనమే మీకు అనుకూలంగా మారుతుంది. కొత్తగా ఆలోచనలు సాగినా పనులు మాత్రం ముందుకు సాగవు. మిత్రులు శత్రువులు అయ్యే అవకాశం ఉంది. అప్పుల బాధ లేదా స్థిరాస్తి దురాక్రమణ అవకాశాలున్నాయి. స్వయం నిర్ణయాలకు మంచి రోజులు కావు. గురువు ఉపదేశం పొందిన వారి వల్ల అనుభవజ్ఞులైన వారి వల్ల పనులు సానుకూల పరుచుకోవచ్చు. వారం మధ్యలో అంటే బుధ గురువారాల్లో ఉత్సాహాన్నిచ్చే ఒక పని జరిగి ధైర్యాన్ని పుంజుకుంటారు. వత్తిడులకు గురవుతారు. ఏకాగ్రతతో మెలగండి మంచి జరగవచ్చు. ఉత్తరాషాడ వారికి ప్రత్యక్ తార కావున వ్యతిరేక ఫలితాలు. శ్రవణ నక్షత్రం వారు శుభ ఫలితాలు చూస్తారు. ధనిష్ఠ వారికి పనులు వాయిదా పడతాయి.

పరిహారం:శనికి తైలాభిషేకం చేయించండి. చిమ్మిలి (నువ్వులు, బెల్లం )చేసి శనివారంనాడు ఆవుకి తినిపించండి.

కుంభ రాశి:

ఈ రాశి వారికి మంచి రోజులు వస్తున్నాయి. తాత్కాలిక మిత్ర స్థానాల్లో ఉన్న ఆరు గ్రహాలు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నిమిత్త మాత్రంగా మీరు తలిస్తే చాలు పనులు చకచకా జరిగిపోతాయి. మీకు సహాయ సహకారాలు అందించే వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. స్వక్షేత్రం పైన శని దృష్టి వలన వ్యయం కావలసినది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. గురుని ఆచ్ఛాదన దృష్టి వల్ల మీ మాటకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగం, రాజకీయ, వ్యాపారములలో ఉన్నతిని సాధిస్తారు. ఆర్థిక,హార్దిక అభినందనలే కాదు లాభాలను కూడా పొంద గలరు. దీర్ఘ వ్యాధులు ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించండి. ఇంట్లో కళ్యాణ ఘడియలు వచ్చాయి. పిల్లల చదువు పట్ల దృష్టి కేంద్రీకరించండి. వారు ఒంటరివారనే భావనలను దగ్గరకు రానీయకండి. మీరు వారిపై దృష్టి సారించలేకపోయినా, వాళ్ల ప్రవర్తన గుర్తించకపోయినా నష్టపోయే తల్లిదండ్రులు మీరే అవుతారు. మంచి గా భావించి వారు చేసిన స్నేహాలు చెడుకు దారి తీస్తాయి. ధనిష్ఠ వారికి విపత్తార కావున అనుకోని కారణాలతో పనులు వాయిదా పడతాయి. వివాహ విషయం వారికి శుభ ఘడియలు వచ్చాయి. పూర్వాభాద్ర వారికి జన్మ తార గాన ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.

పరిహారం: కృష్ణాష్టకం పఠించండి. వివాహం కావలసిన వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి.

మీన రాశి:

ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువ. అంతా మంచే జరగాలని కోరుకోండి. అవి అలానే జరుగుతాయి. రాజ్యాధిపతి గురుని ప్రభావం వల్ల ఆర్థికంగా మెరుగు అవుతారు. ఈ రాశి వారికి ఈ వారం ఆలోచనలు ఎక్కువ. ఆచరణ తక్కువ.శ్రమ పడటానికి ఇష్టపడరు. అందువలన పొందాల్సిన మంచి ఫలితాన్ని పొంద లేకపోవచ్చు. పదవ ఇంట్లో గురు శని కేతువులు తాత్కాలిక మిత్రులై కార్య అనుకూలతకు సిద్ధపడతారు. సరైన పథకంతో మీరుంటే మీ పని ఈ వారంలో నెరవేరబోతోంది. ఉద్యోగ వ్యాపారాలలో పరవాలేదు. రాజకీయాల్లో పెద్దగా రాణించలేరు. మీరు రెండు నాలుకల ధోరణి ఉన్న వారిగా గుర్తింప బడతారు. ఫలితం వున్నా లేకున్నా మీరు నమ్మిన వాళ్ల దగ్గరే ఉండండి. ఇబ్బంది నమ్మిన వాళ్లకు మీరు సహకరిస్తే వెంటనే మంచి ఫలితాలు వస్తాయి. చతుర్ధం లో ఉచ్చసఁథానంలో ఉన్న రాహువు మీకు మీ పిల్లలకు మంచి భవిష్యత్ ఇస్తాడు. 17వ తేదీ తర్వాత మీ జాతకం లో మార్పు జరుగుతుంది. పూర్వాభాద్ర వారు ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఉత్తరాభాద్ర వారికి శుభ ఫలితాలు. రేవతి వారికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి.

పరిహారం: సుదర్శన స్తోత్రం చేయండి. గురు పాదుకాస్తుతి చేయండి. సర్వమంగళ మాంగళ్యే శ్లోకం పఠిస్తే శుభఫలితాలు ఎక్కువ .

Next Story