ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే ఆర్టీసీ బస్సు రూట్లను ప్రకటించిన ఏపీ ఆర్టీసీ

By సుభాష్  Published on  8 Nov 2020 2:07 AM GMT
ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే ఆర్టీసీ బస్సు రూట్లను ప్రకటించిన ఏపీ ఆర్టీసీ

ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే ఆర్టీసీ బస్సు రూట్లను ప్రకటించింది ఏపీ ఆర్టీసీ. 13 జిల్లాల్లోని 12 రూట్లలో మొత్తం 638 బస్సులు తిరగనున్నాయి. ఇందులో ఒక్క హైదరాబాద్‌కే 534 బస్సులను నడపనున్నట్లు ఏపీ ఆర్టీసీ తెలిపింది. తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు 104 బస్సులు తిప్పేలా ప్రణాళికలు రూపొందించింది ఏపీ ఆర్టీసీ. విజయవాడ నుంచి తెలంగాణకు వెళ్లే రూట్లలో బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. గతంలో 264 బస్సులను నడపగా, ఇపపుడు 166కు పరిమితమైంది. ఇక 1,60,999 కిలోమీటర్లలో హైదరాబాద్‌కు 1,46,998 కిలోమీటర్లు, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు 11 వేల కిలోమీటర్ల మేర బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో ఏపీ ఆర్టీసీ 2,65,367 కిలోమీటర్ల మేర తెలంగాణ భూ భాగంలో బస్సులు తిప్పేది. అయితే ఇప్పుడు ఖరారైన బస్సు రూట్లను టీఎస్‌ ఆర్టీసీకి ఏపీ ఆర్టీసీ పంపించింది.

కాగా, ఈ నెల 2న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్‌రాష్ట్ర ఒప్పందం ఖరారైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఏపీ ఎస్‌ఆర్టీసీ 452 బస్సులను తెలంగాణకు నడపుతుండగా, ఆక్యుపెన్సీ 67 శాతంగా నమోదవుతోంది. 452 బస్సుల్లో 389 బస్సులు హైదరాబాద్‌కు , 63 తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు నడపుతున్నారు. వీటి ద్వారా ఏపీ ఆర్టీసీకి రూ.68.17 లక్షల ఆదాయం వస్తోంది. ఒక్క హైదరాబాద్‌ రూట్‌ ద్వారా రూ.59.30 లక్షల ఆదాయం సమకూరుతోంది.

Next Story