నీ హద్దుల్లో ఉండు : అచ్చెన్నపై ఏపీ స్పీకర్ ఆగ్రహం

By రాణి  Published on  20 Jan 2020 8:44 AM GMT
నీ హద్దుల్లో ఉండు : అచ్చెన్నపై ఏపీ స్పీకర్ ఆగ్రహం

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ 3 రాజధానులు, పాలనా వికేంద్రీకరణపై, అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో వివరణ ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి బొత్స ప్రసంగించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ మాట్లాడుతుండగా అచ్చెన్నాయుడు అడ్డుతగిలారు. ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని హద్దుల్లో ఉండాలని హెచ్చరించారు.

తమకు మాట్లాడే అవకాశం కల్పించడంలేదని ఒక పక్క టిడిపి నేతలు ఆరోపిస్తుంటే..స్పీకర్ అచ్చెన్నపై నిప్పుకణికలా మండిపడ్డారు. టిడిపి నేతలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు వాపోయారు. అనంతరం రాజధాని భూములపై సమగ్ర విచారణ జరిపించాలని స్పీకర్ సీఎం జగన్ ను కోరగా..స్పీకర్ ఆదేశాలను తప్పక పాటిస్తామని జగన్ తెలిపారు.

చంద్రబాబుపై బొత్స ఆగ్రహం

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..టీడీపీ నేతలు స్పీకర్ స్థానాన్ని అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ అన్న, సభాపతి అన్న చంద్రబాబుకు ఇంగితమైనా గౌరవం లేదని బొత్స ఆరోపించారు. స్పీకర్ ను పట్టుకుని నువ్వెవరు అని చంద్రబాబు అడగడంపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండటం రాష్ర్టం చేసుకున్న ఖర్మ అని వ్యాఖ్యానించారు. అలాగే స్పీకర్ కు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story