12 కార్పొరేషన్లు, 74 మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

By రాణి  Published on  9 March 2020 12:59 PM GMT
12 కార్పొరేషన్లు, 74 మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ర్ట ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ..ఏపీలో ఉన్న 15 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను..12 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం, నెల్లూరు, రాజమండ్రి కార్పొరేషన్ లకు కోర్టు స్టే లు ఉన్న కారణంగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

అలాగే మొత్తం 104 మున్సిపాలిటీలకు గాను..74 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. మిగిలిన 16 మున్సిపాలిటీల్లో కోర్టు వివాదాలు, పంచాయతీల విలీనంపై స్టే ల వల్ల ఎన్నికలు నిర్వహించడం లేదని తెలిపారు. కొత్తగా ఏర్పాటైన 12 మున్సిపాలిటీల్లో సంబంధిత ప్రక్రియలు పూర్తికానీ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం లేదని ఆయన స్పష్టం చేశారు.

Also Read :

వంద దాటేసిన కరోనా దేశాల

ఈ నెల 11వ తేదీ నుంచి 13 వరకూ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ, 23న పోలింగ్ ఉంటుందన్నారు. ఏ కారణంచేతనైనా 23న పోలింగ్ జరుగకపోతే 26న రీపోలింగ్ నిర్వహిస్తామన్నారు. 27న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు ప్రభుత్వ సిబ్బంది సరిపోవడంతో గ్రామ వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించడం లేదని పేర్కొన్నారు. MPTC, ZPTC ఎన్నికలు ముందే ముగిసినా మున్సిపల్ పోల్స్ ముగిసిన తర్వాతే..వాటి ఫలితాలను వెల్లడిస్తామన్నారు.

కాగా..ఈ నెల 21న ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్, 23న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 24న MPTC, ZPTC ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది.

Next Story