మద్యం వ్యవహారం: ఏపీలో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్‌..!

By సుభాష్  Published on  2 Sep 2020 5:32 AM GMT
మద్యం వ్యవహారం: ఏపీలో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్‌..!

మద్యపాన విషయంలో ఏపీ సర్కార్‌ కఠినంగా వ్యవహరిస్తోంది. మద్యం ఏరులై పారుతోంది. లిక్కర్‌ ధరలను భారీగా పెంచి మద్యం దుకాణాలను సైతం తగ్గించేసింది. మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. ఇంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం ఏపీకి రాకుండా మరింత కఠిన చర్యలు చేపడుతోంది. ఏపీలో బ్రాండెడ్‌ మద్యం దొరకని కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తప్పు చేస్తే పోలీసు సిబ్బందిపై కూడా కొరఢా ఝులిపిస్తోంది. తాజాగా కర్ణాటకలోని తుంకూర్‌ జిల్లా పావగడ్‌ తాలుకాలోని జాలేడు గ్రామం నుంచి అక్రమంగా రాష్ట్రానికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

దీంతో వారి వద్ద నుంచి పోలీసులు రూ.50వేల లంచం తీసుకున్నట్లు పోలీసులపై ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు ఏపీ అధికారులు. అంతర్గత విచారణలో లంచం తీసుకున్నది నిజమని తేలడంతో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యారోకు చెందిన ఎస్సైలు జిలాన్‌ బాషా, శివప్రసాద్‌లతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు మోహన్‌, మురళీ కృష్ణలను అరెస్టు చేసినట్లు ఎస్పీ రామ్‌మోహన్‌ తెలిపారు. వారిని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించనున్నట్లు ఆయన వివరించారు.

పట్టుబడిన వాహనాలను బహిరంగంగా వేలం

కాగా, అక్రమ మద్యం రవాణాపై ఏపీ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యం తరలిస్తూ పట్టుబడిన వాహనాలను బహిరంగంగా వేలం వేస్తామని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. మంగళవారం కృష్ణా జిల్లాలోని పలు చెక్‌పోస్టులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కొన్ని నెలలుగా ఎస్‌ఈబీ ఆధ్వర్యంలో మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. గత మూడున్నర నెలల్లో 3,683 అక్రమ మద్యం రవాణా కేసులు నమోదు చేశామన్నారు. 2180 వాహనాలను కూడా సీజ్‌ చేసి రూ. 4 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అంతేకాకుండా పరివర్తన కార్యక్రమం ద్వారా నాటుసారా తయారు చేసే వారి కుటుంబాల్లోని యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది అవినీతికి పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల సరిహద్దుల నుంచి భారీగా అక్రమ మద్యం వస్తోందని, దానికి అడ్డుకట్ట వేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Next Story