ఏపీలో మిన్నంటిన నిరసనలు
By రాణి
ముఖ్యాంశాలు
- పాలన వికేంద్రీకరణకు టీడీపీ వ్యతిరేకమన్న చంద్రబాబు
- నల్ల బెలూన్లు, నల్లజెండాలతో నిరసన
- హోంమంత్రి ఇంటి ముట్టడి
- మాజీ మంత్రి, టీడీపీ శ్రేణులు అరెస్ట్
ఏపీ పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతిని నిర్ణయించింది ఏపీ కేబినెట్. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తుళ్లూరు నుంచి అమరావతికి వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకోబోయిన క్రమంలో కొంతమందికి గాయాలయ్యాయి. తమ బాధను అర్థం చేసుకోవాలని, మూడు రాజధానులొస్తే..తమ త్యాగానికి అర్థం ఉండదని వాపోయారు రైతులు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతికి వెళ్లి తీరుతామని భీష్మించుకుని కూర్చున్నారు. ఇది తమ జీవన్మరణ సమస్య గానీ..పోలీసులు,
ఎమ్మెల్యేలు, మంత్రులెవరిదీ కాదన్నారు.
ఏపీ కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా వెలగపూడిలో స్వచ్ఛందంగా బంద్ చేశారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అమరావతి విద్యార్థి యువజన ఐకాస నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన తెలిపింది. ఐకాస నేతలను అరెస్ట్ చేసి రైల్వే కల్యాణ మండపానికి తరలించారు పోలీసులు. అలాగే రాష్ర్ట నీటిసంఘాల నేత ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావును, విశాఖలో మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు గృహ నిర్భందం చేశారు.
అదేవిధంగా మందడంలో నల్లజెండాలతో నిరసన తెలిపారు. భద్రతా పర్యవేక్షణలో భాగంగా పోలీసులు స్థానికంగా ఉన్న ఇళ్లపై డ్రోన్ లను ఎగురవేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా అక్కడి యువతి, యువకులు ఇళ్లపై నల్లజెండాలను ఎగురవేశారు. 'సేవ్ అమరావతి..సేవ్ ఆంధ్రప్రదేశ్' అని రాసి ఉన్న బోర్డులను ఇళ్లకు తగిలించారు.
పార్టీ నేతలతో అసెంబ్లీకి బయల్దేరిన చంద్రబాబు
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీకి కాలినడకన బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒక రాష్ర్టం..ఒకే రాజధాని అన్నది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులను ఒప్పుకోబోమని, పాలనా వికేంద్రీకరణకు తాము పూర్తిగా వ్యతిరేకమన్నారు. పోరాడి అమరావతిని కాపాడుకుంటామని తెలిపారు.
అమరావతి ఐకాస, విపక్షాలు ఛలో అసెంబ్లీ నేపథ్యంలో టీడీపీ నేతలు గుంటూరులోని హోం మంత్రి సుచరిత ఇంటిని ముట్టడించారు. మంత్రి ఇంటి ఎదురుగా మాజీ మంత్రి ఆలపాటి రాజా, డేగల ప్రభాకర్, నజీర్, తదితరలు బైఠాయించి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వీరిని అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే మాజీ మంత్రి నక్కా ఆనందబాబును అరెస్ట్ చేశారు.