కేబినెట్ భేటీలో చర్చించిన విషయాలివే..

By రాణి  Published on  27 Dec 2019 9:11 AM GMT
కేబినెట్ భేటీలో చర్చించిన విషయాలివే..

ముఖ్యాంశాలు

  • ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణకు కేబినెట్ ఆమోదం
  • కొత్త 108,104 వాహనాల కొనుగోలు
  • పంచాయతీ రాజ్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు
  • రాజధాని మార్పుపై త్వరలోనే ప్రకటన

వెలగపూడి : ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించిన విషయాలను మంత్రి పేర్ని నాని కేబినెట్ భేటీ అనంతరం మీడియా ద్వారా వివరించారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ పై కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై సీబీఐ విచారణకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. న్యాయ నిపుణలతో చర్చించిన తర్వాత ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణకు లోకాయుక్త లేదా సీబీఐకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. 2014 డిసెంబర్ 31న రాజధాని ప్రకటనకు ముందు జరిగిన భూముల కొనుగోళ్లపై దర్యాప్తు జరుగుతుందని నాని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని మంత్రులు, కుటుంబ సభ్యులు, కారు డ్రైవర్లు, ఇంకా ఎవరెవరు భూములు కొన్నారో ఈ దర్యాప్తులో తేలుతుందన్నారు.

ప్రభుత్వ నిధులతో బందరు పోర్టు నిర్మాణం

అలాగే రాష్ర్టంలో పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రులకు 412 కొత్త 108 వాహనాలు, 656 కొత్త 104 వాహనాలను కొనుగోలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాల్లో ఎన్నో అవకతవకల వల్ల ఆగిపోయిన బందరు పోర్టును రాష్ర్ట ప్రభుత్వం స్వంత నిధులతో నిర్మించేందుకు కంకణం కట్టుకుందని పేర్ని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఎస్ వీపీని ఏర్పాటు చేస్తుందన్నారు. అలాగే కృష్ణపట్నం పోర్టు ముఖపరిధిని కుదిస్తూ...రామయ్యపట్నం పోర్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

రైతుల కోసం రాష్ర్టంలో 341 శాశ్వత పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా రాయచోటిలో నాలుగు ఎకరాల భూమిని వక్ఫ్ బోర్డుకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ప్రతి సంవత్సరం పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్యాల పంటలకు మద్దతు ధర ప్రకటించి నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. అలాగే కృష్ణాజిల్లాలోని సూరంపల్లిలో సిపెట్ సంస్థ కోసం 6 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు పేర్ని వెల్లడించారు.

అప్పుడే హడావిడి చేయొద్దు

ఏపీలో రాజధాని ఏర్పాటుపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను గత ప్రభుత్వం పక్కన పెట్టి కేవలం నారాయణ కమిటీ నివేదికను గత ప్రభుత్వం ఆమోదించిందని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. అమరావతిలో ఊహాజనిత రాజధానిని నిర్మించి, ఇక్కడున్న ఆస్తులను సొమ్ము చేసుకోవాలని కొందరు పెద్ద మనుషులు ఆశ పడ్డారని పేర్ని నాని విమర్శించారు. అలాంటివేమీ జరుగకపోయే సరికి రైతులను రెచ్చగొట్టి..నిరసనలు చేయిస్తున్నారన్నారు. త్వరలోనే రాజధాని తరలింపుపై ప్రభుత్వం అందరికీ అనుకూలమైన ప్రకటన చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ ప్రకటన ద్వారా ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయం రాకుండానే హడావిడి చేస్తూ ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులను నాశనం చేయడం మంచి పద్ధతి కాదని సూచించారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన అన్ని ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చారు.

Next Story
Share it