ఆరోగ్య శ్రీ చెక్కులు బౌన్స్ ..!?

By రాణి  Published on  16 Dec 2019 8:33 AM GMT
ఆరోగ్య శ్రీ చెక్కులు బౌన్స్ ..!?

వెలగపూడి : రాష్ర్టంలో ఆరోగ్య శ్రీ అమలులో చాలా అవకతవకలు జరిగాయని మంత్రి ఆళ్ల నాని ఆరోపించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శ్రీ పై పర్యవేక్షణ కరువై వైద్యారోగ్య శాఖ దిగజారిపోయిందని విమర్శించారు. అంతేకాక ఆరోగ్య శ్రీ కోసం కేటాయించిన నిధులను పక్కదారి పట్టించారని, తత్ఫలితంగా ఆరోగ్య శ్రీ పై అప్పటి సీఎం చంద్రబాబు సంతకం చేసిన చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ రూ.600 కోట్ల బకాయిలను చెల్లించారని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. అలాగే ఆరోగ్య శ్రీ లో పెను మార్పులు తీసుకొచ్చారని, ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నాక విశ్రాంతి సమయంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పుకొచ్చారు. వైద్య ఆరోగ్య రంగ అభివృద్ధిపై టీడీపీ వాళ్లు ఆత్మవిమర్శ చేసుకోవాలని నాని హితవు పలికారు.

నాడు-నేడులో భాగంగా ఆస్పత్రుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వాస్పత్రులను దశలవారీగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆస్పత్రుల్లో టెక్నీషియన్స్ కొరతను త్వరలోనే భర్తీ చేస్తామని, మే నెలాఖరు నాటికి టెక్నీషియన్స్ కొరత లేకుండా చూస్తామని వెల్లడించారు మంత్రి ఆళ్ల నాని.

Next Story
Share it