శ్రీనివాసగౌడ రికార్డును బద్దలు కొట్టిన నిషాంత్‌శెట్టి

By Newsmeter.Network
Published on : 18 Feb 2020 5:49 PM IST

శ్రీనివాసగౌడ రికార్డును బద్దలు కొట్టిన నిషాంత్‌శెట్టి

కర్ణాటక సంప్రదాయ క్రీడ 'కంబాళ'లో సత్తాచాటిన శ్రీనివాస గౌడ రికార్డును మరిచిపోకముందే.. మరో రికార్డు ఈ పోటీల్లో నమోదైంది. బజగోళి జోగిబెట్టు ప్రాంతానికి చెందిన నిషాంత్ శెట్టి అనే వ్యక్తి 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకన్లలో పరిగెత్తాడు. వేగం పరంగా లెక్కిస్తే నిషాంత్ శెట్టి 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలో పరిగెత్తినట్టే. ఉసేన్‌ బోల్ట్‌ (9.58 సెకండ్లలో 100 మీటర్లు) ప్రపంచ రికార్డు వేగాన్ని మించిన వేగం నమోదైనట్టే. అంటే బోల్ట్‌ కంటే 0.07 సెకండ్లు వేగంగా నిశాంత్‌ పరుగు పూర్తి చేశాడు. దీంతో గతంలో శ్రీనివాస గౌడ నమోదు చేసిన రికార్డును కూడా నిషాంత్ శెట్టి బద్దలు కొట్టాడు.

వారం రోజుల క్రితం ఇదే ‘కంబాళ’ పోటీల్లో శ్రీనివాస గౌడ 13.62 సెకండ్లలో 142.50 మీటర్లు పరుగెత్తిన సంగతి తెలిసిందే. అంటే వేగం పరంగా 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరిగెత్తాడు. ఇది జమైకా పరుగుల వీరుడు ఉసేన్‌ బోల్ట్‌ రికార్డు కంటే 0.03 సెకన్లు తక్కువ. ఈ రికార్డు వేగానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో.. అతనిపై ప్రశంసల వర్షం కురిసింది. పంట పొలాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన శ్రీనివాస్‌ గౌడకు ట్రైనింగ్‌ ఇస్తే గొప్ప అథ్లెట్‌ అవుతాడని ఆనంద్‌ మహింద్రా ట్వీట్‌ చేయడం.. దానికి క్రీడల మంత్రి కిరన్‌ రిజుజు స్పందించి అతనికి సాయ్‌ నుంచి ఆహ్వానం పంపుతామని బదులివ్వడం తెలిసిందే.

అయితే తాను ఇప్పుడే సాయ్‌ ట్రయల్స్‌కు హాజరుకాలేనని, దానికి కొంత సమయం కావాలని కోరనున్నట్లు శ్రీనివాస గౌడ తెలిపాడు. అంతే కాకుండా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప శ్రీనివాసను తన కార్యాలయానికి పిలిపించి అతణ్ని శాలువాతో సత్కరించి రూ.3 లక్షల నగదు బహుమతి అందించారు. ఇక శ్రీనివాస గౌడ రికార్డును తిరగరాసిన నిశాంత్‌కు ఎలాంటి ఆహ్వానం అందుతుందో చూడాలీ మరీ..

Next Story