జర్మనీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

By రాణి  Published on  31 Jan 2020 10:57 AM GMT
జర్మనీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

జీవితంపై కన్న కలలన్నింటినీ మూట గట్టుకుని ఉన్నత విద్య కోసం అతను జర్మనీ వెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక చదువుల ఒత్తిడి భరించలేక హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు గుంటూరు జిల్లాకు చెందిన మెహనరెడ్డి (23). మోహన రెడ్డి స్వస్థలం గుంటూరు జిల్లా ముప్పాళ్ల గ్రామం. రైతు కుటుంబానికి చెందిన అతను 2017లో ఎంఎస్ చేసేందుకు జర్మనీ వెళ్లి..అక్కడ డస్ బర్గ్ ఈస్సెన్ యూనివర్శిటీలో చేరాడు. కాగా..సెమిస్టర్లలో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో మోహనరెడ్డి ఆందోళన చెందాడు. మరికొద్ది రోజుల్లో కోర్సు పూర్తయిపోతుంది. కోర్సు పూర్తయ్యేలోగా బాక్ లాగ్ సబ్జెక్టుల్లో పాస్ అవుతానో లేదోనని కలత చెందాడు.

ఇదే విషయాన్ని నాలుగు రోజుల క్రితం మోహన్ తండ్రి గోవిందరెడ్డికి ఫోన్ చేసి చెప్పుకుని బాధపడ్డాడు. సరిగ్గా చదవలేకపోతున్నానని, మిగతా సబ్జెక్టుల్లో పాసవుతానో లేదోనని ఆందోళనగా ఉందని చెప్పడంతో...తండ్రి ధైర్యం చెప్పాడు. ఎలాంటి ఆందోళన లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకుని పరీక్షలు రాయమని సూచించాడు. తండ్రి ధైర్యం చెప్పినా...కొడుకు తనలో ఆ ధైర్యాన్ని నింపుకోలేకపోయాడో ఏమో. తల్లిదండ్రుల గురించి ఇసుమంతైనా ఆలోచన రాలేదేమో. బుధవారం తాను ఉంటున్న హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని యూనివర్శిటీ అధికారులు కుటుంబానికి ఫోన్ ద్వారా తెలియజేయడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఉన్నత చదువులు చదివి..చేతికి అంది వస్తాడనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలన్నీ మోహన్ రెడ్డి ఆత్మహత్యతో అడియాశలయ్యాయి. చదవుల ఒత్తిడి తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య చేసుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

Next Story