రైలులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండగా, సాటి ప్రయాణికురాలు డయల్ – 100 కు సమాచారం అందజేసింది. స్పందించిన పోలీసులు పది నిముషాల్లో అంబులెన్స్ వాహనం, డాక్టర్ తో పాటు పోలీసులు రైల్వే స్టేషన్లో సిద్ధంగా ఉన్నారు. ఆ గర్భిణీని అంబులెన్స్ వాహనంలోకి తీసుకొచ్చి ప్రాథమిక వైద్య సేవలు అందించారు. అనంతరం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించడంతో పండంటి పాపకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే..

కర్నూలు నగరం లక్ష్మీనగర్ కు చెందిన వరలక్ష్మికి కడప పట్టణం కుమ్మరపేటకు చెందిన నాగరాజుతో వివాహమైంది. ఈమె ప్రస్తుతం నవ మాసాల గర్భిణీ. ఈరోజు ఉదయం కడప నుంచి కర్నూలుకు తన భర్త సహా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో బయలు దేరింది. తాడిపత్రికి రాక మునుపే ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఇబ్బందులకు గురైంది.  ఇది గమనించిన సాటి ప్రయాణికురాలు ఉదయం 9:10 గంటలకు డయల్ – 100 కు సమాచారం అందించింది. ఆ రైలు తాడిపత్రి రైల్వే స్టేషన్ కు ఉదయం 9:25 గంటలకు చేరింది. అంతలోపే తాడిపత్రి డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాలు మేరకు పట్టణ సీఐ తేజోమూర్తి, ఎస్ఐ లు అంబులెన్స్ వాహనం, డాక్టర్ సహా సిద్ధంగా ఉన్నారు.

అంబులెన్స్ లో ప్రథమ  చికిత్స అందించి ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. డయల్ – 100 కాల్ తో సత్వరమే స్పందించి గర్భిణి మహిళను ఆదుకున్న పోలీసులను స్థానికులు, సాటి ప్రయాణికులు అభినందించారు. జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు, సి.ఐ తేజోమూర్తి బృందాన్ని ప్రశంసించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.