వాళ్లు కొండను తవ్వారు..రోడ్డు వేశారు..

By రాణి  Published on  14 Feb 2020 7:10 AM GMT
వాళ్లు కొండను తవ్వారు..రోడ్డు వేశారు..

దశరథ మాఝీ కథ గుర్తుంది కదూ. తన ఊరికి, పొలానికి మధ్య ఉన్న కొండను తవ్వి ఒంటి చేత్తో రోడ్డు వేసిన మాఝీ పాతిక కిమీ దూరాన్ని రెండు కిమీ కి తగ్గించేశాడు. కొండను తవ్విన మాఝీని మౌంటెన్ మ్యాన్ అని పిలిచేవాళ్లు. ఒక మనిషి ఒంటి చేత్తో ఎంత చేయగలడో మాఝీనిరూపించాడు. ఆయన గాథను ఒక సినిమాగా తెరకెక్కించారు కూడా. నవాజుద్దీన్ సిద్దిఖీ, రాధికా ఆప్టేలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించారు.

విశాఖపట్నంలోని దుర్గమమైన కొండల్లో, దట్టమైన అడవుల్లో నివసించే అనంతగిరి ప్రాంత గిరిజనులకు దశరథ్ మాఝీ కథ బహుశః తెలిసి ఉండకపోవచ్చు. కానీ దశరథ్ మాఝీ చేసిన పనినే వాళ్ళూ చేశారు. ఎవరో ఒక్కరు కాదు. మొత్తం ఊరు ఊరంతా కలిసి ఓ అద్భుతం చేశారు. అందుకే వాళ్లు ఇప్పుడు మౌంటెన్ మెన్, మౌంటెన్ వుమెన్ గా నిలిచారు. ఏజెన్సీ ఏరియాలోని దట్టమైన అడవులు, కొండలను తొలిచి పదిహేను కిమీ పొడవైన రోడ్డును వేశారు. “నా జీవితంలో రోడ్డును చూస్తాననుకోలేదు. మా ఊరి నుంచి మండల కేంద్రానికి రోడ్డు లేదు. ఫలితంగా చాలా మంది రోగులు, గర్భిణులు డోలీలో ఆస్పత్రికి తీసుకెళ్తూండగానే చనిపోయారు” అంటుంది గిరిజన మహిళ మోదల కర్రియమ్మ. నిజానికి ఇది ఆమె ఊరి కథే కాదు. 6700 చ.కి.మీ వైశాల్యం ఉన్న ఏజెన్సీలో 2200 గిరిజన బస్తీల్లో దాదాపు 1100 బస్తీల పరిస్థితి ఇంతే.

బొన్నేరు కు చెందిన మోదల వెంకట్రావు సివిల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తన ఊరైన బొన్నేరు నుంచి పదిహేను కి.మీ దూరంలో ఉన్న చీడిమెట్ట వరకూ రోడ్డు లేదు. చీడి మెట్ట నుంచి దేవరపల్లి వరకూ రోడ్డు ఉంది. బొన్నేరు-చీడిమెట్ట మధ్య రోడ్డు వేయమని ఎన్నో వినతులు చేసుకున్నా ఫలితం లేకపోయింది. నిజానికి ప్రభుత్వం కన్వర్జెన్స్ స్కీమ్ లో 2018-19 లోనే రోడ్డు ను మంజూరు చేసింది. కానీ ఈ పనిని చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దాంతో తమ ఊరికి తామే దారి వేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

బొన్నేరు, నడుమవలస, పందిరి మామిడి, పూతికపట్టు, జగడాల మామిడి గ్రామాలకు చెందిన 300 మంది పిల్లలు, పెద్దలు, ఆడా మగా, ముసలీ ముతకా చేయి చేయి కలిపి, పలుగుపారా చేత పట్టి తమ రోడ్డు తామే వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రోజుకొక కిమీ చొప్పున రోడ్డు వేసుకున్నారు. దాదాపు 2200 మంది ప్రజలకు దీని వల్ల లాభం కలిగింది. గిరిజనుల పట్టుదల చూసిన తరువాత ఐటీడీయే రూ. 40 లక్షలు మంజూరు చేశాయి. ఇప్పుడు ఈ కచ్చా రోడ్డును వీలైనంత త్వరలో పక్కా చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Next Story