యాంకర్ రష్మీ గౌతమ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శనివారం నానక్ రామ్ గూడలోని తన నివాసంలో మొక్కలు నాటారు. రష్మీ మొక్కలు నాటిన అనంతరం మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా రష్మీ గౌతమ్ మాట్లాడుతూ..మనిషి మనుగడకు కావాల్సిన ప్రధాన వనరైన ఆక్సిజన్ ను పెంపొందించుకోవడం మనందరి కర్తవ్యమన్నారు. ప్రాణవాయువైన ఆక్సిజన్ ను మనకు అందించి మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ ను చెట్లు పీల్చుకుంటాయని, అలాంటి చెట్లను అందరం రక్షించుకోవాలన్నారు. కేవలం ఆక్సిజన్ ను ఇవ్వడమే కాకుండా పరిసరాలలో వున్న కుళ్ళు వాసనలను, కలుషితమైన గాలిని గ్రహించుకొని స్వచ్చపరుస్తాయన్నారు. ఇలా చెట్ల వల్ల మనం ఎన్నో లాభాలు పొందుతున్నామని పేర్కొన్నారు రష్మీ గౌతమ్.

మనస్సుంటే మొక్కలను ఎక్కడైనా నాటొచ్చన్నారు. మొక్కలు నాటేందుకు ఆసక్తి లేనివారే..ఖాళీ స్థలం లేదు అని సాకులు చెప్తుంటారన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను , వాతావరణ లో హెచ్చుతగ్గులను సమతుల్యత చేయడానికి ప్రతిఒక్కరూ మొక్కలను నాటాలన్నారు. అందుకే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తానూ మొక్కలను నాటానన్నారు. యాక్టర్ సత్యదేవ్, అనసూయ భరద్వాజ్, శేఖర్ మాస్టర్లకు తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇచ్చానని..వారు మొక్కలు నాటాక ఒక్కొక్కరు మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ ఇస్తారన్నారు. ఇలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా తగ్గుతున్న చెట్ల సంఖ్యను పెంచుకుని..వాతావరణంలో వచ్చిన పెనుమార్పులను మళ్లీ పూర్వస్థితికి తీసుకెళ్లచ్చని రష్మి అభిప్రాయపడ్డారు. కాగా..గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిని రష్మీని సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

రష్మీ గౌతమ్ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ కు వ్యాఖ్యాతగా (యాంకర్) పనిచేస్తున్నారు. తనువచ్చెనంట, అంతం, చారుశీల, గుంటూర్ టాకీస్, అంతకుమించి తదితర సినిమాల్లో నటించి మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.