తెలుగు తెరపై ఇటీవలి కాలంలో రియాలిటీ షోలు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ నిజానికి అసలు సిసలైన రియాలిటీ షోలను ఒకప్పుడు తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయం చేసింది మాత్రం యాంకర్ ఓంకార్..! తన సొంత బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన షోలు అప్పట్లోనే ప్లాన్ చేశాడు. ‘ఓంకార్ అన్నయ్యా’ అంటూ కంటెస్టెంట్లు.. ఒకరి మీద ఒకరు విరుచుకుపడే జడ్జీలు..! ఒకటా.. రెండా.. ఎన్నో ఎపిసోడ్లు.. బ్రేక్ తర్వాత జరగబోయేది ఏంటి.. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు.. అంటూ ఎదురుచూసే టీవీక్షకులు. అలా అందరినీ టీవీలకు కట్టిపడేసేవాడు ఓంకార్.

ఇప్పుడు మరోసారి సరికొత్త టీవీ షోతో ముందుకు వచ్చాడు ఓంకార్. వైట్ సూట్ వేసుకుని.. బ్యాగ్రౌండ్ లో రోజాపువ్వులు.. హోస్ట్-డైరెక్టర్ ఓంకార్ ‘ఇస్మార్ట్ జోడీ’ తో సరికొత్తగ వచ్చేశాడు. ఫిబ్రవరీ 23న మాటీవీలో ఈ టీవీ షో మొదలైంది. మొత్తం 12 సెలబ్రిటీ జంటలు వారాంతాల్లో సందడి చేయనున్నారు. ‘ఇది రియాలిటీ షో అని.. కానీ దీనికో ప్రత్యేకత ఉందని’ నవ్వుతూ చెప్పారు ఓంకార్.

ఇస్మార్ట్ జోడీ..

స్టార్ మాలో ఓంకార్ ఇంతకు ముందే ‘సిక్స్త్ సెన్స్’ అనే ప్రోగ్రామ్ ను చేశారు. ఇప్పుడు ఇస్మార్ట్ జోడీతో అందరి ముందుకు వచ్చారు. ఓంకార్ ఈసారి మాంచి డాన్స్ షోతో ముందుకు రావాలని భావించాడు. స్టార్ మా అభ్యర్థనతో ‘ఇస్మార్ట్ జోడీ’ కి ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. ఈ రియాలిటీ షోలో 12 సెలబ్రిటీ జంటలు తమ ప్రేమ యొక్క గొప్పదనాన్ని.. తమ బంధాన్ని అనుబంధాన్ని ప్రేక్షకులకు తెలియజేయనున్నారు. ‘సరికొత్తగా చూపిస్తేనే ఆడియన్స్ ను ఆకర్షించగలమని.. స్టార్ మా ఇచ్చిన కాన్సెప్ట్ కు తనదైన స్టైల్ లో కొన్ని మార్పులు చేశానని’ ఓంకార్ చెప్పుకొచ్చారు. బుల్లితెర స్టార్ ప్రభాకర్, కొరియోగ్రాఫర్లు సందీప్, యశ్వంత్, అస్మిత అస్రాణి, శివ జ్యోతి, ఇంద్రనీల్, మేఘనలు ఈ షోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు. వీరంతా తమ జీవిత భాగస్వాములతో షోలో పాల్గొననున్నారు.

చాలా మంది సెలెబ్రిటీల జీవిత భాగస్వాములను టీవీ ఆడియన్స్ చాలా తక్కువగా చూసి ఉంటారని.. స్టార్ వెనుక ఉన్న జీవిత భాగస్వామి ఎవరు.. వారు ఎలాంటి వారు అని తెలుసుకోడానికి ఈ షో ఉపయోగపడుతుందని ఓంకార్ చెప్పుకొచ్చారు. మొదటి ఎపిసోడ్ లో వారి పెళ్లి రోజును తిరిగి సృష్టించారు. ఈ సెలెబ్రిటీ జంటల్లో కొందరు ముప్పై సంవత్సరాల క్రితం ఏడడుగులు నడిచింటే.. కొందరు మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారని.. వాళ్ళ పెళ్లి సమయంలో ఎటువంటి బట్టలు వేసుకున్నారో అవే వేయించి అప్పటి క్షణాలను తిరిగి సృష్టించామని.. వారి జీవితాల్లో ఎంతో స్పెషల్ క్షణాలను మరోసారి గుర్తుచేశామని ఓంకార్ అన్నారు. అలాగని అదేదో వెడ్డింగ్ వీడియోలా చూపించకుండా.. ఎంటర్టైన్మెంట్ తో అందరికీ నచ్చేలా రూపొందించామని అన్నారు. ఈ షోలో రొమాన్స్ కూడా ఉంటుందని.. ఎంతో డీసెన్సీతో కూడుకుని ఉంటుందని కుటుంబం మొత్తం కలిసి హాయిగా వీక్షించవచ్చని ఓంకార్ చెప్పారు. సాధారణంగా టీవీ షో అనగానే జడ్జీలు మార్కులు వేయడం, కామెంట్లు చేయడం లాంటివి ఉంటాయని.. కానీ ఈ షోలో అలాంటివేవీ ఉండవని అంటున్నారు ఓంకార్. ఒక పార్టిసిపెంట్ మరొక పార్టిసిపెంట్ కు పరీక్ష పెడతారని అన్నారు.

కొరియోగ్రాఫర్స్ జీవిత భాగస్వామికి మద్దతుగా ఉంటారా ?

ఓ కొరియోగ్రాఫర్ డ్యాన్స్ చేయడంలో దిట్ట.. అలాంటిది వారి జీవిత భాగస్వామితో కలిసి అదే స్టైల్ లో డ్యాన్సు చేయగలరా..? జీవిత భాగస్వామికి అన్ని సమయాల్లోనూ మద్దతుగా నిలవగలరా..? లేదా..? అన్నది ఈ షో ద్వారా తెలుస్తుంది.. చివరి వరకూ నిలిచిన వారే ఛాంపియన్స్ గా నిలుస్తారని ఓంకార్ చెబుతున్నారు. ముఖ్యంగా ఈ షోలో ఎమోషన్లు.. స్పాంటేనియస్ గా వచ్చినవే తప్ప.. ముందుగా స్క్రిప్ట్ లో పొందుపరిచినవి కాదని అంటున్నారు ఓంకార్. ప్రస్తుతం ఓంకార్ సినిమా-టెలివిజన్ మధ్యన తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు.

సినిమాల కంటే టీవీ రంగమే చాలా చాలెంజింగ్ అని ఓంకార్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాలకు అయితే చాలా సమయం ఉంటుందని.. అక్కడ తాను డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే తనకంటూ సపోర్ట్ గా నిలవడానికి ఓ టీమ్ ఉంటుందని.. అదే టెలివిజన్ రంగానికి వస్తే తాను వన్-మ్యాన్ ఆర్మీ అని.. యాంకర్ గానూ ఉంటూనే రైటింగ్, ప్రొడ్యూసింగ్, డైరెక్షన్ కూడా చూసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యంగా తన లుక్స్ కూడా అప్పుడప్పుడు మార్చాల్సి వస్తూ ఉంటుందని నవ్వుతూ చెప్పారు ఓంకార్. ఆడియన్స్ షో లను చూసే విషయంలో కూడా చాలా మార్పులు వచ్చాయని.. ముఖ్యంగా మొబైల్ ఉన్న కారణంగా తమకు అనుకూలమైన సమయాల్లో షోలు చూస్తూ ఉన్నారని ఓంకార్ అంటున్నారు. ఆడియన్స్ ను ఎపిసోడ్ ఆరంభ క్షణాల్లో ఆకట్టుకోగలిగితే తప్పకుండా మొత్తం చూడడానికి ఆసక్తి కనబరుస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఓంకార్.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.