కరోనాకి బలైన తొలి విదేశీయుడు

By రాణి  Published on  8 Feb 2020 11:24 AM GMT
కరోనాకి బలైన తొలి విదేశీయుడు

చైనాలో కరోనా టెర్రర్ కట్టలు తెంచుకుంది. ముఖ్యంగా హుబెయ్ ప్రావిన్స్, వుహాన్ నగరాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. శనివారానికి కరోనా మృతుల సంఖ్య 724 కు చేరగా..తాజాగా తెలిసిన విషయం విదేశీయుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటి వరకూ అక్కడ మృతి చెందిన వారు చైనీయులే కానీ..ఇప్పుడు అమెరికా పౌరుడు కరోనా బారిన పడి మృతి చెందినట్లు చైనాలో ఉన్న రాయబార కార్యాలయం వెల్లడించింది. బహుశా కరోనాతో మృతి చెందిన తొలి విదేశీయుడే అతనే కావచ్చునని వైద్యులు భావిస్తున్నారు. కాగా..ఈనెల 6వ తేదీన వూహాన్ లోని ఒక ఆస్పత్రిలో అమెరికా పౌరుడు కరోనా బారిన పడినట్లు తేలింది. అతను మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కాగా..మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలేమీ వెల్లడించలేమని తెలిపింది రాయబార కార్యాలయం. తమ దేశంలో ఉన్న 19 మంది విదేశీయులకు వైరస్ సోకినట్లుగా చైనా ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది.

అలాగే జపాన్ పౌరుడు కూడా కరోనా బారిన పడే మృతి చెందినట్లుగా ఆ దేశ విదేశాంగ శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. వుహాన్ లో ఉన్న జపనీయుడు ఇటీవలే తీవ్ర జ్వరం, న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరినట్లుగా చైనా అధికారులు జపాన్ కు సమాచారమిచ్చారు. చికిత్స అందిస్తుండగానే అతను మృతి చెందినట్లు తెలిపారు. అతడు కరోనా వల్లే చనిపోయి ఉంటాడని చైనా అనుమానం వ్యక్తం చేసింది. ప్రస్తుతం 34 వేల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Next Story