ఫోన్ కొట్టు – బిల్లు కట్టు: టెలికాం సంస్థల వీరబాదుడు

By Newsmeter.Network  Published on  2 Dec 2019 9:27 AM GMT
ఫోన్ కొట్టు – బిల్లు కట్టు: టెలికాం సంస్థల వీరబాదుడు

దాదాపు నాలుగేళ్ల తరువాత టెలికాం సంస్థలు రేట్ల పెంపుతో ప్రీ–పెయిడ్‌ వినియోగదారులపై బిల్లుల మోత మోగించేందుకు సిద్ధమయ్యాయి. వొడాఫోన్‌–ఐడియా, ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో సంస్థలు తమ తమ టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీనితో ఇన్నాళ్లూ అనుభవించిన సౌకర్యాలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోవడం ఖాయం.

వొడా–ఐడియా, ఎయిర్‌టెల్‌ లు తమ టారిఫ్ ను డిసెంబర్ 3 నుంచి 50 శాతం పెంచగా, జియో తన టారిఫ్‌ ను డిసెంబర్ 6 నుంచి 40 శాతం పెంచనున్నాయి. దీంతో భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా వినియోగదారులు నెలరోజుల కనెక్షన్‌ కోసం కనీసం రూ. 49 కట్టాల్సి ఉంటుంది

వొడాఫోన్‌–ఐడియా ... 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీ గల అన్‌లిమిటెడ్‌ ప్లాన్స్‌ను సవరిస్తూ కొత్త ప్లాన్స్‌ ను అమలులోకి తేనుంది. వీటి పట్ల మార్కెట్ ఏ విధంగా స్పందిస్తుందో చూసిన తరువాత కొత్త ప్లాన్స్ ను ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయి. ఎయిర్ టెల్ ఆదివారం జారీ చేసిన ఒక ప్రకటన లో తమ టారిఫ్‌ పెంపు రోజుకు జస్ట్ 50 పైసల నుంచి రూ. 2.85 వరకు మాత్రమే ఉండబోతోందని తెలిపింది. ఈ అదనపు టారిఫ్ వల్ల మెరుగైన డేటా, కాలింగ్‌ ప్రయోజనాలు ఉంటాయని కూడా ఎయిర్ టెల్ తెలిపింది. జియో దాదాపు 300 శాతం దాకా అదనపు ప్రయోజనాలు అందించే కొత్త ప్లాన్లను అమలు లోకి తేనున్నట్టు ప్రకటించింది. అయితే వొడా–ఐడియా, ఎయిర్‌టెల్‌ 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్‌లో 1,000 నిమిషాలు, 84 రోజుల పథకాల్లో 3,000 నిమిషాలు, 365 వ్యాలిడిటీ ప్లాన్‌లో 12,000 నిమిషాల పరిమితి ఉంటుంది. దీన్ని దాటితే ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చార్జీ ఉంటుంది.

ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఫీజులు, స్పెక్ట్రం వాడకం వంటి విషయాల్లో పెద్ద మొత్తంలో బకాయీలు ప్రకటించాల్సి రావడం, నెట్ వర్క్ పరిధి పెంపు, నష్టాల భర్తీ వంటి కారణాలతో టెలికాం సంస్థలు టారిఫ్ లు పెంచాల్సి వచ్చింది.

Next Story