కీలకమైన ఉపగ్రహాన్ని తయారుచేసిన విద్యార్థులు

By రాణి  Published on  28 Dec 2019 10:16 AM GMT
కీలకమైన ఉపగ్రహాన్ని తయారుచేసిన విద్యార్థులు

ముఖ్యాంశాలు

  • ఉపగ్రహాన్ని తయారు చేసిన ఎన్నారైఐటీ కళాశాల విద్యార్థులు
  • శాటిలైట్ ని కక్ష్యలోకి ప్రవేశ పెడితే దేశ వ్యాప్తంగా జాతీయగీతం
  • హ్యామ్ రేడియోలద్వారా జాతీయ గీతాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు
  • మోర్ కోడ్ ద్వారా శాటిలైట్ కు అప్ లోడ్ అయిన ఆడియో
  • శాటిలైట్ ను పంపేందుకు పూర్తి సహకారం అందిస్తామన్న ఇస్రో
  • విద్యార్థులు తయారుచేసిన కొత్త ఉపగ్రహం పేరు కేసరి

కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలోని ఎన్నారై ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ విద్యార్థులు ఒక కీలకమైన ఉపగ్రహాన్ని తయారుచేశారు. దీన్ని కక్ష్యలోకి ఒకసారి ప్రవేశపెడితే మొత్తం దేశమంతటా ఒకేసారి జాతీయ గీతాన్ని వినిపించే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ చదువుతున్న ఐదుగురు విద్యార్థుల బృందం ఈ కొత్త శాటిలైట్ ని తయారు చేసింది. కోవెల్కర్ సాల్వేందర్ ఘన్ షీద్ బాబా అనే విద్యార్థి ఈ ఐదుగురు సభ్యుల విద్యార్థి సైంటిస్ట్ బృందానికి నేతృత్వం వహించాడు. గుడాల ఉదయ్ కిరణ్, కాసాని రంగారావు, ఆరేపల్లి జగన్, కంటె మనోజ్ కుమార్ ఈ బృందంలోని మిగతా సభ్యులు. తాము తయారు చేసిన ఉపగ్రహానికి కేసరి అని పేరు పెట్టాడు. ఇస్రో సాయంతో ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఈ విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. 1911 డిసెంబర్ 27వ తేదీన కోల్ కతాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా జనగణమన – జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఆర్ముగం రాజరాజన్ సహాయం

ఎన్నారై ఐటీ గ్రూప్ కళాశాలల చైర్మన్ ఆర్. వెంకట్రావ్ ఈ ఘనతను సాధించిన తమ విద్యార్థి బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మోర్స్ కోడ్ ని ఉపయోగించి ఈ విద్యార్థులు జాతీయ గీతం ఆడియోను శాటిలైట్ కి అప్ లోడ్ చేశారు. ఈ ఉపగ్రహం కక్ష్యలోకి చేరితే దేశవ్యాప్తంగా హ్యామ్ రేడియో ఆపరేటర్లందరూ దీన్ని సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి వీలవుతుంది. అసోసియేట్ ప్రొఫెసర్స్ డి.రవిశంకర్, పి.రామకోటేశ్వరరావు ఈ విద్యార్థి బృందానికి మార్గ నిర్దేశం చేశారు. ఈ శాటిలైట్ బ్యాటరీ మ్యానేజ్ మెంట్ సిస్టమ్ ని, హై ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ మీటర్ నీ, యాంటెనాలనూ, దీన్ని పరిరక్షించేందుకు ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థనూ కలిగిఉందనీ అధ్యాపకులు చెబుతున్నారు.

సోలార్ ప్యానెన్స్ ని అనుసంధానం చేస్తే కేసరి ఉపగ్రహం దాదాపు ఆరు నెలలకు పైగా చక్కగా పనిచేస్తుందని విద్యార్థి బృందం సభ్యుడు మనోజ్ కుమార్ చెప్పారు. తమ అధ్యాపకుడు షేక్. అబ్దుల్ రెహమాన్ కి, కళాశాల యాజమాన్యానికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడీ విద్యార్థి. ఎన్నారైఐటీ ప్లేస్ మెంట్ సెల్ డైరెక్టర్ ఎన్.వి.సురేంద్రబాబు సాల్వేందర్ టీమ్ సాధించిన ఘనతను ప్రశంసించారు. ఈ విద్యార్థి బృందం 450 గ్రాముల బరువైన శాటిలైట్ ని తయారు చేయడం కళాశాలకు కూడా గర్వకారణమన్నారు. కేవలం 45 రోజుల్లో విద్యార్థులు ఈ ఘనత సాధించారని చెప్పారు. రష్యన్ సైంటిస్టులు రూపొందించిన స్పూత్నిక్ ని ఆదర్శంగా తీసుకుని తమ విద్యార్థులు ఈ శాటిలైట్ ని తయారుచేశారన్నారు.

ఈ విద్యార్థి బృందం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ ని కలిసి తాము తయారుచేసిన కేసరి ఉపగ్రహం వివరాలను తెలిపింది. తమ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు సాయం చేయాలని కోరింది. తప్పకుండా అందుకు కావాల్సిన పూర్తి స్థాయి సహాయ సహకారాలను అందిస్తామని ఆయన విద్యార్థులకు హామీ ఇచ్చారు.

Next Story
Share it