రెండో దఫా వచ్చేనా.. కరోనా..?

By మధుసూదనరావు రామదుర్గం  Published on  1 Sep 2020 1:10 AM GMT
రెండో దఫా వచ్చేనా.. కరోనా..?

ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తితోపాటు వేగం కూడా పెరిగింది. చాలా రాష్ట్రాల్లో లక్షల్లో కేసులు ఉంటున్నాయి. మరోపక్క కేసులకు దీటుగా రికరవరీ రేటు పెరుగుతోంది. సెప్టెంబర్‌లో లాక్‌డౌన్‌ మరింత సడలింపుల నేపథ్యంలో ఈ వేగం మరింత పుంజుకుంటుందని చాలా మంది అంచనా. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో కొత్త సందేహం ప్రజల్లో వస్తోంది. నిన్న మొన్నటి దాకా కరోనా ఒకసారి వచ్చిన వాళ్ళకు మళ్ళీ రాదనే చెబుతూ వచ్చారు.

కానీ కొత్తగా వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయలేమని వైద్యులు, శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఇప్పటి వ్యాప్తితోనే ఆందోళనలో ఉంటున్న ప్రజలు తగ్గాక మళ్ళీ వస్తుందంటే దాదాపు బెంబేలెత్తి పోతున్నారు. అయితే ఎవరికి రెండో సారి వచ్చే అవకాశముంటుందనే విషయంగా ఇంకా స్పష్టత రావల్సి ఉంది.

వాక్సిన్‌ వచ్చేదాకా జనం అప్రమత్తంగా ఉండక తప్పదని, ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అది మనల్ని కచ్చితంగా పలకరిస్తుందని నిపుణులు అంటున్నారు. అప్పటి దాకా భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని అంటున్నారు. ఇంతకూ రెండోసారి కూడా రావడానికి కారణాలు ఏమై ఉండవచ్చంటే.. శరీరంలో యాంటీబాడీలు తగ్గడమే అని వైద్యులంటున్నారు. కరోనా సోకాక చికిత్స తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పన్నమవుతాయి. వాటి ప్రభావంతో నిరోధక శక్తి పెరిగి వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతుంది. ఇది చాలా మందికి తెలిసిన విషయమే.

అయితే ఈ యాంటీ బాడీలు శరీరంలో తక్కువ కాలమే ఉంటుందట! అవి తగ్గితే మళ్ళీ వైరస్‌ తిరగబెట్టే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హాంకాంగ్‌లోనూ, అమెరికాలోనూ ఈ తరహా కేసులు వెలుగు చూశాయని అంటున్నారు. కరోనా వచ్చి తగ్గాక శరీరంలో ఆరు నుంచి ఎనిమిది వారాలపాటే యాంటీబాడీలుంటాయి.

ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు సాధారణంగా పోషకాహారాలు తీసుకోవడం…అన్ని జాగ్రత్తలు పాటించడంతో శరీరంలో యాంటీబాడీలు పెరుగుతాయి. అయితే వైరస్‌ పోయాక ఇక తగ్గిపోయింది కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొద్ది కాలానికి యాంటీబాడీలు తగ్గి శరీరం మళ్ళీ బలహీనమవుతుంది. వైరస్‌ వెంటనే మళ్ళీ వచ్చే అవకాశముంది. కాబట్టి ఈ వైరస్‌ ఉన్నన్నాళ్లు.. కరోనా వచ్చిన వాళ్లు…రానివాళ్లు అందరూ అప్రమత్తంగాప ఉండాల్సిందే అంటున్నారు వైద్యులు.

పోషకాహారం తినడం, అనసవరంగా బైటికి వెళ్ళకపోవడం, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల వైరస్‌ సోకకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. కరోనా మహమ్మారి ప్రపంచానికి పరిచయమై అయిదునెలలు దాటినందున ఈపాటికే ప్రజలకు దీని ప్రభావంపై చాలా స్పష్టత వచ్చింది. అయితే మొండిగానో, మితిమీరిన ఆత్మ విశ్వాసంతోనో ఉండేవారిని వైరస్‌ వదలదని గుర్తెరగాలి. ఒక్కసారి నెగిటివ్‌ అంటూ వచ్చాక శరీరంలో వైరస్‌ లేదనే అనుకోవాలి. అయితే సున్నితంగా ఉండేవారు.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి అని డాక్టర్లు అంటున్నారు.

కోవిడ్‌తో దేశ మొదటి మహిళా కార్డియాలజిస్ట్‌ మృతి

ఈ వాదన ఇలా ఉండగా అసలు రెండోసారి కరోనా వచ్చే అవకాశం చాలా తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించినట్లు సమాచారం. రెండోసారి వచ్చే అవకాశం 0.04 శాతం మాత్రమేనని అంటున్నారు. ఈ విషయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖాతర్‌ విభాగం, ఆ దేశ ప్రజారోగ్య శాఖ, ఖాతర్‌ కారెన్నల్‌ వర్సిటీలు సంయుక్తంగా పరిశోధనలు చేశాకే వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ పరిశోధనలో భాగంగా లక్షాముప్పై వేల మంది కరోనా వచ్చి పోయిన వారిని పరీక్షించారు. 45 రోజులు తర్వాత మళ్ళీ వారిని పరీక్షించగా పాజిటివ్‌ వచ్చిన 54 మందిలో 41 శాతం మందికి కొద్దిపాటి లక్షణాలుంటే 58శాతం మందికి ఏ లక్షణాలు లేవని తేలింది.

దేశంలో కరోనా అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఒకటి రెండు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ వ్యవధిని సెప్టంబర్‌ 30 దాకా పొడిగించినట్లు తెలుస్తోంది. అయితే రావాణాకు సంబంధించి అంతర్‌ రాష్ట్రాల మధ్య ఆంక్షలు తీసివేస్తుండటంతో వ్యాప్తి పెరిగే అవకాశముందేమోనని చాలా మంది భయపడుతున్న మాట వాస్తవం. కరోనా గురించి భయం సరే కానీ ఎన్నాళ్లు ఇలా ఉండాలి? ఇప్పటికే దేశ ఆర్థిక పరిస్థితి కకావికలమవుతోందని పలువురు అంటున్నారు.

మరోపక్క కరోనా ప్రభావంతో మూతపడిన స్కూళ్ళు, థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునేలా లేవు. విద్యాసంవత్సరం దెబ్బ తినరాదని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ క్లాసులంటున్నా అవి ఎంతవరకు సఫలమవుతాయో చెప్పలేం. అయితే యాజమాన్యాలు స్కూళ్లను తెరవడానికి ఉత్సాహం ప్రదర్శిస్తున్నా ప్రభుత్వమే కాదు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఇప్పట్లో పంపడానికి సిద్ధంగాలేరు. అలాగే థియేటర్ల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు.

థియేటర్లు మూత పడటంతో యజమానులు నష్టపోవడమేకాదు.. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్న చాలా మంది కుదేలయ్యారు. అందుకే థియేటర్ల యాజమానుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని థియేటర్లు నడపడానికి అనుమతినివ్వాల్సిందిగా కోరుతున్నాయి. అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తామని అంటున్నాయి. అయితే వందలాది మంది ఓకే భవనంలో మూడుగంటలపాటు ఉండటం ఇప్పట్లో సాధ్యమేనా అన్నదే చాలా మంది మదిలో మెదలుతున్న సందేహం. ఏది ఏమైనప్పటికీ వ్యాక్సిన్‌ వచ్చేదాకా మనం కరోనా పోయిందని అనుకోలేం. ఇది మాత్రం వాస్తవం!!

గడిచిన 24 గంటల్లో దేశంలో 78వేల కేసులు, మరణాలు 971

Next Story