సమంత 'నో' చెప్పడం అదితికి కలిసొచ్చిందా..?

By రాణి  Published on  19 Feb 2020 7:07 AM GMT
సమంత నో చెప్పడం అదితికి కలిసొచ్చిందా..?

అదితి రావ్ హైదరీ.. 2006 లోనే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకూ సోలో హీరోయిన్ గా ఆమె కెరీర్ లో పెద్ద సక్సెస్ ను చూడలేదు. సంజయ్ లీలా భన్సాలీ 'పద్మావత్' సినిమాలో నటించినా ఆమెకంటూ సరైన గుర్తింపు దక్కలేదు. మణిరత్నం 'చెలియా' ద్వారా ఆమెకు దక్షిణాదిన గుర్తింపు దక్కింది. సమ్మోహనం, అంతరిక్షం సినిమాల ద్వారా తెలుగు వాళ్లకు కూడా బాగా దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. నాని, సుధీర్ బాబు కాంబినేషన్ లో వస్తున్న 'వి' సినిమాలో కూడా అదితి ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇక ప్రస్తుతం మణిరత్నం రూపొందిస్తున్న భారీ చిత్రం 'పొన్నియిన్ సెల్వన్' షూటింగ్ లో బిజీగా ఉంది అదితి. ప్రస్తుతం చెన్నైలో ఉన్న అదితికి చివరి నిమిషంలో ఓ తెలుగు సినిమా ఆఫర్ వరించింది. సమంత అక్కినేని స్థానంలో అదితి రావ్ హైదరీకి ఛాన్స్ దక్కింది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'మహాసముద్రం' సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ కు జంటగా 'సమంత' నటించాల్సి ఉంది. షూటింగ్ స్టార్ట్ అయ్యే తరుణంలో సమంత ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం అదితి రావుకు చెప్పగా స్క్రిప్ట్ విన్న ఆమె మహాసముద్రంలో నటించడానికి ఓకె చెప్పేసింది.

మహాసముద్రం కాస్టింగ్ విషయంలో మొదటి నుండి ఎన్నో మార్పులు చోటుచేసుకుంటూ ఉన్నాయి. ఈ సినిమాలో మొదట నాగ చైతన్య, సమంతలు నటిస్తారని టాక్ నడిచింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ.. నాగచైతన్య స్థానంలో మాస్ మహారాజ రవితేజ వచ్చాడు. 'డిస్కో రాజా' ఫ్లాప్ అవ్వడంతో రవి తేజ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నారని చెబుతున్నారు. ఇక శర్వానంద్ అయితే లీడ్ క్యారెక్టర్ కు బాగుంటాడని అనుకున్నారు. ఆ కథ శర్వానంద్ కు కూడా నచ్చడంతో అందుకు ఒప్పుకున్నాడు. శర్వా-సమంత కాంబినేషన్ లో ఈ సినిమా షూటింగ్ మొదలవ్వాల్సిన టైమ్ లో.. సమంత చివరి క్షణాల్లో ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చింది. శర్వానంద్-సమంతల లేటెస్ట్ చిత్రం 'జాను' ఫ్లాప్ గా నిలవడంతో సమంత మాహా సముద్రం నుండి తప్పుకుంది. ఏది ఏమైనా చివరి నిమిషంలో అదితి రావ్ హైదరి ప్రాజెక్టులో నటించడానికి ఓకె చెప్పడంతో చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది. 'ఆర్ ఎక్స్ 100' లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అజయ్ భూపతి 'మాహా సముద్రం' సినిమాను మరో కల్ట్ క్లాసిక్ గా రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు.

Next Story
Share it