కొద్దిరోజుల క్రితం ఇండియన్-2(భారతీయుడు-2) సెట్స్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. క్రేన్ యాక్సిడెంట్ జరుగగా ముగ్గురు చనిపోయారు. 10 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టింది. దీంతో మక్కల్ నీది మయం పార్టీ వ్యవస్థాపకుడు, ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న కమల్ హాసన్ ను విచారణకు హాజరవ్వమని ఆదేశాలు జారీచేశారు. దీంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారుల ముందు కమల్ హాసన్ హాజరయ్యారు.

ఈవీపీ ఫిల్మ్ సిటీలో ఇండియన్-2 షూటింగ్ జరుగుతూ ఉండగా క్రేన్ ప్రమాదం చోటుచేసుకుంది. నజరాత్ పేట్ పోలీసు స్టేషన్ లో ఈ ఘటనపై కేసు నమోదవ్వగా ఆ తర్వాత సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కు కేసును ట్రాన్స్ఫర్ చేశారు. వెపేరీ లోని పోలీసు కమీషనర్ ఆఫీసులో కమల్ హాసన్ తన లాయర్ తోనూ, పార్టీ కార్యకర్తలతో అక్కడికి చేరుకుని విచారణలో పాల్గొన్నారు. గత వారం సినిమా దర్శకుడు శంకర్ కూడా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరయ్యాడు. దీంతో ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేశారు అధికారులు.

ప్రత్యక్ష సాక్షి నేనే : కమల్

మంగళవారం మధ్యాహ్నం 1 గంట వరకూ కమల్ హాసన్ క్రేన్ యాక్సిడెంట్ కు సంబంధించిన వివరాలను అధికారులకు తెలియజేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తనకు అధికారుల నుండి సమన్లు అందాయని అందుకే అధికారుల ఎదుట హాజరైనట్లు తెలిపారు. ఆ ఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని.. ప్రత్యక్ష సాక్షి తానేనని చెప్పారు కమల్. ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి అతి దగ్గర ఉన్నది తానేనని.. వెంట్రుక వాసిలో ప్రమాదం నుండి తప్పించుకున్నానని కమల్ మీడియాకు తెలిపారు. ఆరోజు ఏమి జరిగిందో పోలీసులకు వివరించానని అన్నారు. షూటింగుల సమయాల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలో కూడా పోలీసులతో మాట్లాడినట్లు తెలిపారు. త్వరలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన తామంతా హాజరై.. ఇటువంటి ఘటనలు సంభవించకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంపై చర్చించబోతున్నామన్నారు.

కమల్ హాసన్ ను ప్రశ్నించడాన్ని మక్కల్ నీది మయం పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. కమల్ హాసన్ ను కావాలనే టార్గెట్ చేశారని.. తమ నేత పాపులారిటీని జీర్ణించుకోలేని కొందరు ఇలా కమల్ ను విచారణకు పిలిచారని అన్నారు. 250పైగా సినిమాల్లో నటించిన ఆయన్ను కొన్ని గంటల పాటూ ప్రశ్నించడం ఏమిటని.. తమిళనాడు ప్రభుత్వం ఆయనపై కక్షగట్టిందని స్టేట్మెంట్ విడుదల చేశారు. కమల్ హాసన్ కు తోడుగా కొన్ని లక్షలమంది పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఎం.ఎన్.ఎం. పార్టీ తమ స్టేట్మెంట్ లో తెలిపింది. ఇండియన్-2 షూటింగ్ లో చోటుచేసుకున్న ప్రమాదంపై అన్ని వివరాలు ఇవ్వడం తన కనీస ధర్మమని కమల్ హాసన్ మీడియాకు చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే మక్కల్ నీది మయం పార్టీ తమ స్టేట్మెంట్ ను విడుదల చేసింది. ఫిబ్రవరి 19న ఇండియన్-2 సెట్స్ లో చోటుచేసుకున్న క్రేన్ యాక్సిడెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కృష్ణ, ఆర్ట్ అసిస్టెంట్ మధు, ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ దుర్మరణం పాలయ్యారు. మెయిన్ లీడ్ చేస్తున్న కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ మరికొందరు ఈ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.