అల్జీమర్స్ కి అద్భుతమైన వాక్సీన్

By Newsmeter.Network  Published on  1 Jan 2020 9:23 AM GMT
అల్జీమర్స్ కి అద్భుతమైన వాక్సీన్

ముఖ్యాంశాలు

  • ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో అల్జీమర్స్ బాధితులు
  • అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న పరిశోధనలు
  • అల్జీమర్స్ నివారణ వాక్సీన్ కనుగొన్న ఆస్ట్రేలియా శాస్త్రవేత్త
  • అల్జీమర్స్ కి సమాధానం దొరికిందంటున్న నికోలై పెట్రోవ్ స్కీ
  • ల్యాబ్ ట్రయల్స్ లో విజయం, త్వరలో క్లినికల్ ట్రయల్స్
  • అల్జీమర్స్ రీసెర్చ్ అండ్ థెరపీ జర్నల్ లో వివరాలు

మతిమరుపుకు ప్రపంచంలోనే ఇప్పటికీ సరైనమందుల్లేవు. ఒకవేళ ఉన్నా అవన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్న దాఖలాలూ కనిపించడంలేదు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో అల్జీమర్స్ లాంటి జబ్బులకు పరిష్కారాన్ని కనుక్కునేందుకు ఏళ్లుగా ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మతిమరుపు అస్సలు రాకుండా చేసే వాక్సీన్ ని కనుగొనేందుకు చేసిన ప్రయోగాల్లో సఫలత కనిపించడం విశేషం.

ప్రస్తుతం ఈ వాక్సీన్ ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. దీన్ని జంతువులపై ప్రయోగించి చూసినప్పుడు అద్భుతమైన ఫలితాలు కనిపించాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. బ్రెయిన్ ప్లేగ్ ని నిరోధించడానికి, అసలు మతిమరుపు అన్న పదమే వినిపించకుండా చేసేందుకు ఈ ప్రయోగం పెద్ద ఎత్తున జరుగుతోంది. అన్ని దశల్లోనూ మంచి ఫలితాల్ని ఇస్తోంది కూడా. ఇకపై ఈ వాక్సీన్ పనితీరును క్లినికల్ ట్రయల్స్ లో నిర్థారించడమే తరువాయి. అంటే మనుషులమీద ప్రయోగించి చూడడమన్నమాట.

మతిమరుపుతో బాధపడుతున్న రోగులకు శుభవార్త

ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయం సాధిస్తే అల్జీమర్స్ కి సరైన చికిత్సను కనుగొన్నట్టే లెక్క. అంతకంటే ఎక్కువగా అసలు ఆ మతిమరుపు అనే పదమే జీవితాల్లో లేకుండా పోయేలా చేసే చక్కటి వాక్సీన్ దొరికినట్టు లెక్క. అల్జీమర్స్ రీసెర్చ్ అండ్ థెరపీ జర్నల్ లో ప్రచురించిన ఈ విశేషాలు ప్రపంచవ్యాప్తంగా మతిమరుపుతో బాధపడుతున్న రోగుల్లో కొత్త ఆశల్ని చిగురింపుజేశాయి.

ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులార్ మెడిసిన్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం కలసి చేస్తున్న ఈ విస్తృత స్థాయి పరిశోధనలు కచ్చితంగా 2020లో ఓ కొలిక్కి వస్తాయని ఈ సరికొత్త వాక్సీన్ ని కనుగొన్న ఆస్ట్రేలియన్ పరిశోధకుడు నికోలై పెట్రోవ్ స్కీ చెబుతున్నారు.

ఆస్ట్రేలియా ల్యాబ్ లో ఈ సరికొత్త వాక్సీన్ ని అన్ని విధాలుగా పరీక్షించిన చూసిన తర్వాత సంతృప్తికరమైన ఫలితాలను నమోదయ్యాయన్న నమ్మకంతోనే ముందుకెళ్లడం జరుగుతోందని ప్రొఫెసర్ అనాహిత్ గోచిక్యన్, మాధ్యూ బ్లర్టన్ జోన్స్ చెబుతున్నారు.

అడ్వాక్స్ అడ్జువెంట్ మెథడ్ లో మల్టీ టెప్ బేస్ట్ వాక్సీన్ ను సమర్థంగా తయారుచేయగలిగితే భవిష్యత్తులో అద్భుతమైన విజయాలు సాధించవచ్చని వాక్సీన్ రూపకర్త నికోలై పెట్రోవ్ స్కీ అంటున్నారు. ప్రత్యేకంగా అల్జీమర్స్ కోసం మాత్రం విడిగా రూపొందించిన వాక్సీన్ ని కూడా క్లినికల్ ట్రయల్స్ కి పంపుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అల్జీమర్స్ వ్యాధి బారినపడుతున్న వాళ్లు కోట్ల సంఖ్యలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ దీన్ని నివారించేందుకు, తగ్గించేందుకు మందులు కనిపెట్టడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు లాబ్స్ లో సక్సెస్ అయిన మందులు ఇప్పటివరకూ క్లినికల్ ట్రయల్స్ లో రోగులమీద పరీక్షలు జరిపినప్పుడు పూర్తిగా ఫెయిలయ్యాయి.

ఈసారి నికోలై పెట్రోవ్ స్కీరూపొందించిన కొత్త వాక్సీన్ వైద్య ప్రపంచంలో అల్జీమర్స్ కి సరికొత్త సమాధానం దొరికిందన్న ఆశల్ని రేకెత్తిస్తోంది. 2020లో దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరగబోతున్నాయి. అవి పూర్తి స్థాయిలో సక్సెస్ సాధిస్తే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అర్జీమర్స్ నుంచి విముక్తి దొరికినట్టేనని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story