రేణిగుంట రైల్వే స్టేషన్‌లో కలకలం.. 6నెలల బాలుడి కిడ్నాప్‌

By Newsmeter.Network  Published on  4 March 2020 5:39 AM GMT
రేణిగుంట రైల్వే స్టేషన్‌లో కలకలం.. 6నెలల బాలుడి కిడ్నాప్‌

చిత్తూరు జిల్లా రేణిగుంట రైల్వేస్టేషన్‌లో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. పని ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళ.. కొత్త బట్టలు కొనిస్తానని బయటకు తీసుకెళ్లి బాలుడితో ఉడాయించింది. దీంతో బాధితురాలు రేణిగుంట రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాడిపత్రికి చెందిన స్వర్ణలతకు అదే పట్టణానికి చెందిన శివుడితో 5 ఏళ్ల కిందట వివాహామైంది. వారికి 6నెలల చిన్నారి ఉన్నాడు. భర్త తాగి వచ్చి నిత్యం వేధించడంతో భరించలేక భర్తతో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. అయినా.. భర్త పుట్టింటికి వచ్చి మరీ వేధిస్తుండడంతో పిల్లాడితో సహా రేణిగుంట రైల్వేస్టేషన్‌కి వెళ్లి.. వారం నుంచీ అక్కడే ఉంటోంది. ఇది గమనించిన ఓ మహిళ.. స్వర్ణలతను చేరింది. మంచిదానిలా నటించింది. ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పింది.

స్వర్ణలతకు భోజనం పెట్టి.. కొత్త బట్టలు తెచ్చి వాటిని కట్టుకోమని పంపింది. రెండ్రోజులుగా తనతోనే ఉంటోంది కదా అని స్వర్ణలత నమ్మి బాబును ఆమె చేతిలో పెట్టి బట్టలు మార్చుకోవడానికి బాత్‌రూంకి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి బాబూ లేడూ ఆ కిలాడీ కూడా లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాలుడి తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి ఇద్దరు అనుమానిత మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story
Share it