విజయవాడలో తొలి కరోనా కేసు

By Newsmeter.Network  Published on  22 March 2020 8:45 AM GMT
విజయవాడలో తొలి కరోనా కేసు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 5కు చేరాయి. శనివారం మూడు కేసులుండగా ఆదివారం కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. విజయవాడలో తొలి కరోనా కేసు నమోదవ్వడంతో బెజవాడ వాసులంతా భయాందోళనలు చెందుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇన్నిరోజులు ఎక్కడెక్కడున్నాడు. ఎవరితో మాట్లాడాడు. వారంతా ఇంకా ఎక్కడెక్కడ తిరిగి ఉంటారోనని ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఇంకా 25 కరోనా అనుమానిత కేసుల రిపోర్టులు రావాల్సి ఉంది.

కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మీడియాతో మాట్లాడుతూ..ఇటీవలే ప్యారిస్ నుంచి వచ్చిన వ్యక్తి ఈ నెల 17,18 తేదీల్లో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. 18వ తేదీన తీవ్ర జ్వరంరావడంతో అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించి, రక్తనమూనాలను సేకరించారని పేర్కొన్నారు. బాధిత వ్యక్తికి సంబంధించిన రిపోర్టులు శనివారం రావడంతో అతడికి కరోనా ఉన్నట్లుగా డాక్టర్లు నిర్థారించారని తెలిపారు. బాధిత వ్యక్తి నివాసమున్న పరిసరాల్లో 500 ఇళ్లల్లో కూడా ఎవరికైనా కరోనా లక్షణాలున్నాయన్న దానిపై సిబ్బంది తనిఖీలు చేశారన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఈ వ్యక్తిని తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్ తిరుగు ప్రయాణంలో ముగ్గురిని ఎక్కించుకుని వెళ్లినట్లు తెలిపారు. పోలీసులు ఆ క్యాబ్ డ్రైవర్ వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.

గడిచిన మూడ్రోజుల్లో అతను యెవరెవరితో మాట్లాడాడన్న దానిపై ఆరా తీస్తున్నామన్నారు. ఎవరికైనా కరోనా లక్షణాలున్నట్లైతే భయపడకుండా డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. దయచేసి ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Next Story
Share it