పెళ్లి చేసుకుని ఉత్సాహాంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఆ యువకుడికి నవ వధువు షాకిచ్చింది. కడుపు నొప్పితో బాధపడుతున్న భార్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. ఆమెకు రెండు నెలల గర్భం అని వైద్యులు చెప్పారు. అది విని ఆ భర్త షాక్‌కు గురయ్యాడు. అనంతరం మోసపోయానని కోర్టును ఆశ్రయించాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని ​బులంద్‌షహర్ జిల్లా నైమాండి చౌకి గ్రామానికి చెందిన ఓ యువకుడికి ఫిబ్రవరి 15న వివాహం జరిగింది. పెళ్లైన మూడు రోజులకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు రెండు నెలల గర్భంతో ఉందని తేల్చారు. పెళ్లై మూడు రోజులు కూడా కాలేదు.. రెండు నెలల గర్భవతి అని తెలియడంతో ఆ భర్త షాక్‌కు గురయ్యాడు. అనంతరం తేరుకుని
ఏం జరిగిందని భార్యను నిలదీశాడు. దీంతో అసలు నిజం చెప్పింది.

బులంద్‌షహర్ జిల్లాలోని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఆమె అలీఘర్‌కు చెందిన యువకుడిని ప్రేమించానని, ఇద్దరం సమయం దొరికినప్పుడెల్లా శారీరకంగా కలిసే వారమని చెప్పింది. వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను నిర్భందించి మరీ వివాహాం చేసినట్లు చెప్పింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తన ప్రియుడే తండ్రి అని అందరి ముందు ఒప్పుకుంది. విషయం విన్న భర్త.. తన భార్య తనను మోసం చేసిందని కోర్టును ఆశ్రయించాడు. భార్య చేసిన నిర్వాకాన్ని కోర్టుకు తెలిపాడు. ఆమె చేసిన పని వల్ల తన కుటుంబం పరువు పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అత్తారింటికి వెళితే.. తనకు ప్రాణహాని ఉందని.. తన ప్రియుడితోనే తన వివాహాం జరిపించాలని కోర్టును ఆ యువతి కోరింది. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆమెను జిల్లా ఆస్పత్రిలోని జ్యోతి కేంద్రంలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.