పదో తరగతి చదువుతున్న ఓ బాలిక పరీక్షకు సరిగా ప్రిపేర్ అవలేదు. దీంతో ఎలాగైనా పరీక్ష తప్పించుకోవాలనుకుంది. అందుకోసం ఓ ఉపాధ్యాయుడిని సలహా అడిగింది. అయితే ఆ టీచర్‌ ఇచ్చిన చెత్త సలహాతో.. ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

కురుంద్వాడలోని భైరేవాడికి చెందిన నిలేశ్‌ బాలు పరధానే అనే వ్యక్తి శృతి గ్రామంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సానికా మాలి అనే విద్యార్థిని పదోతరగతి పరీక్షలకు సరిగా ప్రిపేర్‌ కాలేదు. గత గురువారం స్కూల్లో ప్రాక్టికల్ పరీక్షకు హాజరైన ఆమె పరీక్ష తప్పించుకోవాలనుకుంది. దానికోసం నీలేష్ బాలు ప్రరధానే ను సలహా అడిగింది.

అప్పుడతడు ఆమెకు ఓ చెత్త సలహా ఇచ్చాడు. కొద్దిగా పురుగులమందు తాగమని, అలా చేస్తే స్ప్రహ కోల్పోయి పరీక్ష హాలు నుంచి నేరుగా ఆసుపత్రిలో చేరవచ్చని చెప్పాడు. స్వయంగా అతడే పురుగుల మందు తెచ్చిచ్చాడు. ఆ మాటలు నమ్మిన సానిక ఉపాధ్యాయుడు తెచ్చిఇచ్చిన మందులో నీళ్లు కలుపుకుని తాగింది.

ఆ తర్వాత పరీక్ష హాల్లో స్పృహతప్పిన ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటా ఆమె మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్కూల్లోని విద్యార్థులను, టీచర్లను, ఇతర స్టాఫ్‌ను విచారించి నిలేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సానిక కోరిక మేరకే తాను పురుగుల మందు ఇచ్చినట్లు అతడు ఒప్పుకున్నాడు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.