ఆ రోజే నా భ‌ర్త‌ను చంపేస్తే పీడా పోతుంద‌న్న ఆలోచ‌న వ‌చ్చింది. వెనుకా ముందు చూసుకోకుండా ద‌గ్గ‌ర్లోని దిండును భ‌ర్త ముఖంపై ఒత్తిప‌ట్టా. ద‌గ్గ‌రే ఉంటే లేచి కొడ‌తాడేమోన‌ని భ‌య‌ప‌డి దూరంగా కూర్చొని త‌దేకంగా చూస్తూ ఉండిపోయా. కానీ, చ‌నిపోయాడా? లేదా? అన్న డౌట్ మాత్రం తీర‌లేదు. అప్ప‌టికే బాగా మ‌ద్యం తాగొచ్చి బెడ్‌పై గాఢ నిద్ర‌లో ఉన్నాడు. నేనూ త‌న‌నే చూస్తూ చ‌ల్ల‌గా నిద్ర‌లోకి జారుకున్నా.

16 ఏళ్ల‌కే ప్రేమించి పెళ్లి చేసుకుని, ఒక పెద్ద ఘ‌ట‌న‌తో కొన్ని సంవ‌త్స‌రాలపాటు జైలు జీవితం గ‌డిపిన లావ‌ణ్య చెప్పుకొచ్చిన జీవిత గాధ ఇది. ఇంత‌కీ ఆమె ఎందుకు జైలులో ఉండాల్సి వ‌చ్చింది? ప్రేమ పెళ్లితో ఒక్క‌టైన వారి జీవితంలో ఏం జ‌రిగింది? జైల్లో ఉన్న‌ప్పుడు పిల్ల‌లు ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డారు? ప‌్ర‌స్తుతం ఆమె ఎలా గ‌డుపుతోంది? అన్న విష‌యాలు లావ‌ణ్య మాట‌ల్లో..,

మేము ముగ్గురం ఆడ పిల్ల‌లం. నేను రెండో ఆమెను. అమ్మ‌, నాన్న ఇద్దరూ ప్ర‌భుత్వ ఉద్యోగులే. కాలేజీ నుండి వ‌స్తూ పోతూ ఉన్న స‌మ‌యంలో బ‌స్తీలోని అబ్బాయి న‌న్ను ఇష్ట‌ప‌డ్డాడు. తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో ప్రేమ అంటూ ప్ర‌పోజ్ చేయ‌డంతో ఓకే చెప్పేశా. అస‌లే బ‌స్తీ కావ‌డంతో వేరే వాళ్ల ద్వారా మా ఇద్ద‌రి గురించి ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మంచిది కాదంటూ మా పెద‌నాన్న కొడుకులు నాపై చేయి కూడా చేసుకున్నారు.

ఇంట్లో ఇద్ద‌రి విష‌యం తెలిసిపోవ‌డంతో రాత్రికి రాత్రే వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాం. విష‌యం తెలుసుకున్న మా అమ్మ బ‌స్తీ వాసుల మ‌ధ్య మ‌ళ్లీ పెళ్లి జ‌రిపింది. నా రాత‌లో అదే ఉంద‌ని భావించి క‌ట్న‌కానుక‌లు ఇచ్చి మా పెళ్లి చేసింది. వ‌న్ ఇయ‌ర్ వ‌ర‌కు మా కాపురం బాగానే సాగింది. ఆ స‌మ‌యంలో బంగారం, నా భ‌ర్త‌ను ప‌క్క‌ప‌క్క‌నే పెట్టి ఎవ‌రు కావాలి? అని అడిగితే క‌ళ్లు మూసుకుని నా భ‌ర్తే కావాల‌ని చెప్పేదాన్ని. అంత ప్రేమ నాపై చూపించాడు.

కానీ, ఎప్పుడైతే బాబు పుట్టాడో అప్ప‌ట్నుంచే ప్రాబ్ల‌మ్స్ మొద‌ల‌య్యాయి. అప్ప‌టి వ‌ర‌కు లేని దుర‌ల‌వాట్ల‌న్నీ ఒక్క‌సారిగా ఆయ‌న‌లో పుట్టుకొచ్చాయి.  ఆయ‌న సంపాద‌నంతా తాగ‌డానికే స‌రిపోతుండేది. అత్త వారి త‌రుపున ఇళ్లేమి ఇవ్వ‌క‌పోయేస‌రికి అద్దె ఇంట్లోనే ఉండాల్సి వ‌చ్చింది. దాంతో పూట గ‌డ‌వ‌డం కోసం ఇళ్ల‌ల్లో పాచిప‌నిచేశా. ఒడి దుడుకుల మ‌ధ్య సంసార జీవితం సాగుతుండ‌గా మ‌రో బాబు పుట్టాడు.

అమ్మ వాళ్ల మాట విన‌కుండా పెళ్లి చేసుకున్నందుకు ఈ ప‌రిస్థితి దాపురించింద‌ని అప్పుడు మైండ్‌లో ఆలోచ‌న చేశా. ఒకప‌క్క ఆయ‌న అర్ధం చేసుకోవ‌డం లేదు. మరోప‌క్క క‌ష్టాలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. క‌నీసం అంద‌ర్నీ కాద‌ని చేసుకున్నందుకైనా ఆయ‌న మంచిగా ఉండొచ్చు క‌దా? వ‌ంటి ఆలోచ‌న‌లు ఊరికే వస్తూ ఉండేవి. అప్ప‌టికీ మా అమ్మ‌, నాన్న ఇద్ద‌రూ ప్ర‌భుత్వ ఉద్యోగులే కావ‌డంతో ఇంట్లో సామాన్ల కోసం బాగానే స‌ర్దుబాటు చేసింది.

ముఖంపై దిండు పెట్టి చంపేశా..

భ‌ర్త‌లో మార్పు తీసుకొచ్చేందుకు చాలానే ప్ర‌య‌త్నించా. వాళ్ల ఫ్యామిలీని, నా ఫ్యామిలీని పిలిచి మాట్లాడ‌టం, బ‌స్తీ వాళ్లు మాట్లాడ‌టం అన్నీ జ‌రిగాయి. ఆ ఒక్క రోజు కాళ్లు మొక్కి అమ్మాయిని మంచిగా చూసుకుంటానంటూ తీసుకెళ్లి వారం రోజుల త‌రువాత మ‌ళ్లీ మొద‌టికే వ‌స్తాడు. రోజూ తాగొచ్చి చెప్పుకోని రీతిలో ఇబ్బందుల‌కు గురి చేశాడు. ఇలా ఏడు సంవ‌త్స‌రాల‌పాటు న‌ర‌కం చూపించాడు.

దాంతో రెండు సంవ‌త్స‌రాల‌పాటు అమ్మ వాళ్ల ఇంట్లోనే ఉన్నా. మ‌ర‌లా ఎప్ప‌టిలానే అమ్మ వాళ్ల ఇంటికొచ్చి మంచిగా చూసుకుంటా. క‌ష్టం చేసుకుని పెళ్లాం, పిల్ల‌ల్ని పోషించుకుంటానని చెప్పి తీసుకెళ్లాడు. రెండు సంవ‌త్స‌రాలు వ‌దిలేసి అమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నందుకు ఈ రెండు సంవ‌త్స‌రాలు నాతో కాకుండా ఎవ‌రెవ‌రితో ఉన్నావంటూ టార్చ‌ర్ పెట్టాడు. ఎవ‌రితో ఉంటున్నావ్‌? ఎక్క‌డుంటున్నావ్‌? అంటూ ఫ్రాడ్‌గా మాట్లాడాడు.

ఆ స‌మ‌యంలో నాలో మెంట‌ల్ మూమెంట్ మూమెంట్ వ‌చ్చింది. ఈ మ‌నిషి ఉన్నా ఒక‌టే.. లేకున్నా ఒక‌టే అన్న అభిప్రాయం నా భ‌ర్త‌ప‌ట్ల క‌లిగింది. ఆ రోజు అనుకోకుండా ఫుల్లుగా తాగొచ్చి ఎప్ప‌టిలాగే టీవీ సౌండ్ పెద్ద‌గా పెట్టి న‌న్ను కొట్టాడు. డాడీ.. డాడీ అంటూ వ‌చ్చిన పెద్ద బాబును మంచంపై ఎత్తేశాడు. అలా భ‌ర్త టార్చ‌ర్ భార్య‌గా నాకే కాకుండా, పిల్ల‌ల‌కు, నా త‌ల్లికి టార్చ‌ర్ అన్న ఆలోచ‌న‌తో చంపెయ్యాల‌న్న మూమెంట్ వ‌చ్చింది. దాంతో బాగా తాగొచ్చి ప‌డుకొన్నాక ముఖంపై దుండుపెట్టి నా భ‌ర్త‌ను చంపేశా.

కోర్టు విధించిన శిక్ష‌లో భాగంగా జైల్లో ఉన్న‌ ఏడు సంవ‌త్స‌రాలు టైల‌రింగ్, బ్యూటీషియ‌న్ కోర్స్‌, క్యాండిల్స్, చాక్‌పీసెస్‌, బేక‌రీ వంటి స్వ‌యం ఉపాధి పనులు నేర్చుకున్న లావ‌ణ్య అక్క‌డే డిగ్రీని కూడా పూర్తి చేసింది. ప్ర‌స్తుతం బెయిల్‌పై బ‌య‌ట‌కొచ్చిన లావ‌ణ్య‌ త‌న సంపాద‌న‌తోనే త‌న ఇద్ద‌రు కుమారుల‌ను చ‌దివించుకుంటోంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.