అతనొక సీరియల్ ఈవ్ టీజర్. రైల్వే బ్రిడ్జిలపై కాపు కాసి..ఒంటరిగా కనిపించే ప్రతి అమ్మాయిపై ముద్దుల వర్షం కురిపించి పారిపోతాడు. కానీ..బాధిత మహిళలెవరూ ఇంతవరకూ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం..ఇలా నిత్యం జరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవ్వటంతో అవి కాస్తా రైల్వే పోలీసుల కంట పడ్డాయి. ఆ తర్వాత ఈ సీరియల్ కిస్ టీజర్ కటకటాల పాలయ్యాడు. ఈ ఘనకార్యం ఆర్థిక రాజధాని ముంబైలోని మాటుంగా రైల్వే స్టేషన్ లో వెలుగు చూసింది.

రైల్వే బ్రిడ్జి పై నిత్యం ఒంటరిగా వెళ్తున్న యువతులు, మహిళలను అదను చూసి గట్టిగా పట్టుకుని వారిపై ముద్దుల వర్షం కురింపించి పారిపోతున్న సీరియల్ కిస్ టీజర్ రాయ్ జూర్ హబీబర్ ఖాన్ కథ ఇది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఖాన్ బ్రతుకు తెరువు కోసం ముంబైకి వచ్చి వడ్రంగిగా పనిచేస్తున్నాడు. మాటుంగా రైల్వే బ్రిడ్జిపై వెళ్లే ఒంటరి మహిళలను ముద్దాడి పారిపోవడం ఇతనికి నిత్యం చేసే పనుల్లో భాగమైంది. జనవరి 25వ తేదీన ఒక మహిళను పట్టుకుని ముద్దాడి పారిపోతున్న దృశ్యం రైల్వే పోలీసులకు సీసీ టీవీ ఫుటేజ్ లో కనిపించింది. దీంతో..నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు రైల్వే పోలీసులు సాధారణ వ్యక్తుల్లా వంతెన వద్ద కాపు కాశారు. అనుకున్నట్లుగా బ్రిడ్జిపై ఒంటరిగా వస్తున్న మహిళను పట్టుకుని ముద్దాడేందుకు ఖాన్ ప్రయత్నించగా..మఫ్టీలో ఉన్న మన రైల్వే ఖాకీలు పగడ్బందీగా పట్టుకున్నారు.

సీరియల్ కిస్ టీజర్ ఖాన్ పై రైల్వే పోలీసులు ఐపీసీ సెక్షన్ 379 కింద కేసు నమోదు చేసి కటకటల్లోకి నెట్టారు. కాగా..ఖాన్ పై ఫిర్యాదు చేసేందుకు బాధిత మహిళలెవరూ ముందుకు రాకపోవడంతో అతనిపై దొంగతనం కేసుపెట్టారు. ఖాన్ వల్ల వేధింపులకు గురైన మహిళలు ధైర్యంతో ముందుకొచ్చి కేసులు పెట్టాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లేమీ బయటపెట్టమని హామీ ఇచ్చినా మహిళలెవరూ కేసు పెట్టలేదు. దీంతో ఖాన్ పై ఈవ్ టీజింగ్ కేసు నమోదు చేసేందుకు చట్టపరమైన మార్గాలను గుర్తించే పనిలో పడ్డారు. అయితే ఇతడికి భార్య, పిల్లలున్నట్లు తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు. ఇంట్లో భార్య ఉండగా..ఇలా మహిళలను ఎందుకు వేధిస్తున్నాడో అర్థం కాలేదు వారికి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.