ఆర్టీసీ సమ్మె:ఏజీ హైకోర్ట్ కు రావాల్సిందే:హైకోర్ట్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 10:19 AM GMT
ఆర్టీసీ సమ్మె:ఏజీ హైకోర్ట్ కు రావాల్సిందే:హైకోర్ట్

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ చేపట్టంది. కార్మిక సంఘాలు విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చకు పట్టుబట్టాయంటూ ఆర్టీసీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశాల ప్రకారం 21 డిమాండ్లపై చర్చిద్దామంటే వినలేదన్నారు. విలీనం డిమాండ్‌ పక్కనే పెట్టి మిగతా వాటిపై చర్చించాలని హైకోర్టు సూచించింది. ఒక్క డిమాండ్‌పైనే పట్టుబట్టడం సరికాదని హైకోర్టు పేర్కొంది. కేవలం 21 డిమాండ్లపై చర్చిస్తామన్నారని యూనియన్‌ తరఫు న్యాయవాది దేశాయ్‌ ప్రకాష్‌ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఇతర డిమాండ్లపై చర్చించలేదని కోర్టుకు తెలిపారు. ఆర్టిక భారం లేని డిమాండ్లపై చర్చలు జరగాలని భావించామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.

మొదట 21 డిమాండ్లపై చర్చ జరిగితే.. కార్మికుల్లో కొంత ఆత్మస్థైర్యం కలుగుతుందని హైకోర్టుకు ప్రభుత్వానికి సూచించింది. ఓవర్‌నైట్‌లో ఆర్టీసీ విలీనం ఎలా సాధ్యమవుతుందని ఆర్టీసీ జేఏసీ నేతలను హైకోర్టు ప్రశ్నించింది. మొత్తం డిమాండ్లపై సమ్మె నోటీసు ఇచ్చామని, కేవలం 21 డిమాండ్ల అన్నట్టు అధికారులు ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ సంఘాలు కోర్టు తెలిపాయి. విలీనం డిమాండ్‌ పక్కన పెట్టి మిగతా వాటిపై చర్చించకపోతే ఇలాగే ప్రతిష్టంభన కొనసాగుతుందని.. ఇప్పటికే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు మరోసారి గుర్తు చేసింది. చర్చల వివరాలతో ఆర్టీసీ యాజమాన్యం అదనపు కౌంటర్‌ దాఖలు చేసింది. 16 డిమాండ్లు ఆర్థిక పరమైన వాటితో ముడిపడి ఉన్నాయి. అందులో రెండు డిమాండ్లు అమలుకు సాధ్యం కానివని ఆర్టీసీ యాజమాన్యం తన నివేదికలో పేర్కొంది. తదుపరి వాదనలు కొనసాగుతున్నాయి.

2019-2020 ఏడాదికి రూ.500 కోట్లు కేటాయించారని అదనపు ఏజీ కోర్టుకు తెలిపారు. సమ్మె కారణంగా ఆర్టీసీకి రూ.175 కోట్ల నష్టం వచ్చిందని, ప్రస్తుతం ఆర్టీసీ దగ్గర రూ.10 కోట్ల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. మీకు చర్చలు జరపాలన్న ఉద్దేశం ఉందా.. లేదా అని హైకోర్టు ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రభుత్వానికి ఇంత పట్టింపులు ఎందుకు.. ఇబ్బందులు పడుతున్నది ప్రజలు కాదా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టూల్స్‌, స్పేర్‌ పార్ట్స్‌, యూనిఫామ్స్‌కు ప్రభుత్వం బడ్జెట్‌ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది.

డిమాండ్లలో కేవలం నాలుగు డిమాండ్లు మాత్రమే ప్రభుత్వం తీర్చేలా ఉన్నాయని తెలిపారు. ఆ డిమాండ్లు సాధ్యం అవ్వడానికి రూ.46.2 కోట్ల ఖర్చవుతుందని కోర్టుకు తెలిపారు. రూ.50 కోట్లు ప్రభుత్వం ఇవ్వకుంటే.. కోర్టు ఇవ్వలా అంటూ అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అడ్వకేట్‌ జనరల్‌ను పిలవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వాదనలు హైకోర్టుకు రాష్ట్రప్రభుత్వానికి మధ్య మాత్రమే జరుగుతున్నాయని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ కోర్టుకు హాజరయ్యారు. ఆర్టీసీ సమ్మెపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఎల్లుండికి ప్రభుత్వం గడువు కోరడంతో.. కుదరదని హైకోర్టు తేల్చిచెప్పింది.

Next Story