పానీపూరి ఇప్పిస్తానని చెప్పి..

మైనర్ బాలికకు పానీపూరి ఇప్పిస్తానని ఆశ పెట్టి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో వెలుగుచూసింది. నిందితుడిని అరెస్ట్ చేసిన ఎస్ఆర్ నగర్ ఇన్ స్పెక్టర్ మురళీ కృష్ణ ఘటన వివరాలను వెల్లడించారు. చెత్త ఏరుకుంటూ బీకేగూడలో నివసిస్తున్న దంపతుల కుమార్తె (8)పై అత్యాచారం జరిగింది. తనకు ఒక అంకుల్ పానీపూరి ఇప్పిస్తానని చెప్పి పిలుస్తున్నాడని తల్లికి చెప్పగా..తల్లి ఆమెను ఎక్కడికి వెళ్లొద్దని నచ్చజెప్పి భోజనం పెట్టి, నిద్రపుచ్చింది.

మధ్యాహ్నానికి చూసేసరికి ఇంట్లో కూతురు కనిపించకపోవడంతో..తల్లి చుట్టుపక్కలంతా వెతికింది. అలా వెతుక్కుంటూ ఈఎస్ఐ సమీపంలోకి వెళ్లగా..అక్కడ మద్యం తాగుతూ ఉన్న నాగరాజుతో తన కూతురు కనిపించింది. అతడి వద్ద నుంచి కూతురిని తీసుకెళ్లిన తల్లి ఏం జరిగిందని ప్రశ్నించడంతో..బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. సమోసా, పానీపూరి ఇప్పిస్తానని చెప్పి బీకేగూడ పార్క్ లో ఉన్న బాత్రూమ్ లోకి తీసుకెళ్లి తనపై అత్యాచారం చేసినట్లు బాలిక తెలిపింది. విషయం తెలుసుకున్న తల్లి బుధవారం రాత్రి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేసి పోక్సోచట్టం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.